మోడీ సర్కార్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

` కాంగ్రెస్‌ పెద్దల దిశానిర్దేశం
` కర్నాటక, తెలంగాణ ముఖ్య నేతలతో ఖర్గే, రాహుల్‌ భేటీ
` భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘ సమాలోచనలు
` కులగణన విషయంలోనూ హైకమాండ్‌ కీలక సూచనలు
న్యూఢల్లీి, జూన్‌ 10 (జనంసాక్షి) :
అచ్చేదిన్‌ పేరిట కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ప్రజలను నిలువునా మోసగించిందని కాంగ్రెస్‌ హైకమాండ్‌ విమర్శించింది. అనేక అంశాల్లో మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ప్రజాసంక్షేమమూ పక్కదారి పట్టించిందని అభిప్రాయపడిరది. ఈ నేపథ్యంలో మోడీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాలను క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది. ఢల్లీిలో పలు అంశాలపై హైకమాండ్‌తో భేటీకి వెళ్లిన తెలంగాణ, కర్నాటక ముఖ్య నేతలకు ఖర్గే, రాహుల్‌ గాంధీ భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఆయా రాష్ట్రాల్లో చేపట్టాల్సిన కార్యకలాపాలు, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై, కులగణనపైనా పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత దశాబ్దకాలంలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ఆ దిశగా పార్టీ క్యాడర్‌ మొత్తం ప్రజలకు దగ్గరగా పనిచేయాలని అధిష్టానం సూచించింది. పదకొండేళ్లలో దేశ ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థను దెబ్బతీశారని ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగంలోని ప్రతి పేజీలో నియంతృత్వ సిరాను మాత్రమే పూసిందన్నారు. ‘దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు బలహీనపరిచి, వాటి స్వయంప్రతిపత్తిపై దాడి చేశాయి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లి ప్రభుత్వాలను కూల్చేసిన పార్టీ బీజేపీ. గత 11 ఏళ్లలో రాష్ట్రాల హక్కులను కాషాయ పార్టీ విస్మరించింది. సమాఖ్య నిర్మాణం బలహీనపడిరది. ద్వేషం, బెదిరింపులు, భయానక వాతావరణాన్ని వ్యాప్తి చేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని తిప్పికొట్టాలి’ అని ఖర్గే పిలుపునిచ్చారు.
గత 11 ఏళ్లలో దేశంలో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలు, మైనార్టీలు, బలహీన వర్గాలపై దోపిడీ పెరిగిందని ఖర్గే అన్నారు. వారి రిజర్వేషన్లు, సమాన హక్కులను హరించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మణిపుర్‌లో కొనసాగుతున్న హింస బీజేపీ పరిపాలనా వైఫల్యానికి అతిపెద్ద సాక్ష్యమన్నారు. యూపీఏ హయాంలో సగటున 8 శాతంగా ఉన్న దేశ జీడీపీ వృద్ధి రేటును 5-6 శాతం వద్ద ఉంచడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు అలవాటుగా మార్చుకున్నాయని మండిపడ్డారు. ‘ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీని నెరవేర్చడానికి బదులుగా, యువత నుంచి ఏటా కోట్లాది ఉద్యోగాలు లాక్కుంటున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజా పొదుపులు 50ఏళ్లలో అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక అసమానతలు గత 100 ఏళ్లలో అత్యధికంగా ఉన్నాయి. నోట్ల రద్దు, జీఎస్‌టీ, ప్రణాళిక లేని లాక్‌ డౌన్‌ అసంఘటిత రంగాన్ని దెబ్బతీశాయి. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును నాశనం చేశాయి. మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్టాండ్‌ అప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, నమామి గంగే, 100 స్మార్ట్‌ సిటీలు వంటి కార్యక్రమాలు విఫలమయ్యాయి. భారతీయ రైల్వే నాశనమైంది. కాంగ్రెస్‌ (యూపీఏ) శ్రమించి నిర్మించిన మౌలిక సదుపాయాల రిబ్బన్లను మాత్రమే మోదీ కత్తిరిస్తున్నారు’ అని ఖర్గే విమర్శించారు. ప్రచారం తప్ప జవాబుదారీతనం లేని మోడీ సర్కార్‌.. వర్తమానం వదిలేసి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తోందని రాహుల్‌ సైతం ఇప్పటికే విమర్శించారు.