ఇంటర్ పూర్తి చేసిన సర్టిఫికేట్లు ఇప్పించండీ
కలెక్టరుకు మొరపెట్టుకున్న ఎకెవికె కళాశాల విద్యార్థులు
ఒంగోలు, జూన్ 28 :తామంతా 2010ా12 ఇంటర్మీడియట్ కోర్సును పూర్తి చేసిన సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని గురువారం ూదయం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్రను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము స్థానిక ఎకెవికె కళాశాలలో 2010ా12 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ కోర్సును పూర్తి చేశామన్నారు. తమకు నచ్చిన వివిధ డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు సిద్ధమై కోర్సు పూర్తయిన సర్టిఫికేట్లను అడిగేందుకు కళాశాలకు వెళ్ళామన్నారు. అయితే యాజమాన్యం మాత్రం తమకు సర్టిఫికేట్లు ఇవ్వబోమని, తమ డిగ్రీ కాలేజీలోనే చేరాలని, లేని పక్షంలో సర్టిఫికేట్లు ఇవ్వమని ఖచ్చితంగా తెలిపారన్నారు. ఇదేమని గట్టిగా ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోండి సర్టిఫికేట్లు మాత్రం ఇచ్చేది లేదంటున్నారని వాపోయారు. స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని డిఆర్‌ఓ రాధాకృష్ణమూర్తిని ఆదేశించారు. వెంటనే ఆయన సదరు యాజమాన్యంతో ఫోన్‌లో చర్చించారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి రఘురాం తెలిపారు.