ఉపాధి పనుల్లో వెనుకంజ

భద్రాద్రి కొత్తగూడెం,మే11(జ‌నం సాక్షి ): ఉపాధి పనుల నిర్వహణలో  జిల్లా వెనకబడి ఉందని తెలుస్తోంది. ఈ నెలల్లో కూలీల హాజరు శాతం పెరగకపోతే లక్ష్యాన్ని చేరుకునే అవకాశమేలేదు. కొందరు క్షేత్ర సహాయల పనితీరులో లోపం వల్లే జిల్లాలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కనీసం ఏడాదిలో 15వేల పనిదినాలు కల్పించాల్సి ఉంటుంది. గ్రూపులో కూలీలు ఏ రోజు పనికి రాబోతున్నారో తెలుసుకొని వారికి ఆ రోజు పని కల్పించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని పూర్తిగా పట్టించుకోకపోవడంతో కూలీల హాజరు శాతం బాగా తగ్గుతోంది.  జిల్లాలోని 17 మండలాల్లో ఉన్న 205 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. కొన్ని పంచాయతీల్లో క్షేత్ర స్థాయి ఉద్యోగులు దృష్టి సారించకపోవటంతో హాజరు శాతం బాగా తగ్గినట్లు తెలుస్తోంది. వేసవి మినహా మిగిలిన కాలాల్లో వ్యవసాయ పనులు ఉండటం, కూలీలు ఆ పనుల్లో నిమగ్నమవుతుండటంతో ఏడాది పొడవునా ఉపాధి పనుల నిర్వహణలో ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంటుంది. పూర్తి స్థాయిలో పనులు నిర్వహించేందుకు ఈ రెండు మూడు నెలలు మాత్రమే అవకాశం ఉంటుంది.