ఎంసెట్‌ విద్యార్థులు బలి కావాల్సిందేనా?

పిల్లికి చెలగాటం…ఎలుకకు ప్రాణసంకటం మాదిరిగా ఇప్పుడు ఎంసెట్‌ మెడికల్‌ విద్యార్థుల పరిస్థితి తయారయ్యింది. ఎన్నోరాత్రులు నిద్రలేకుండా చదవిన చదువులు బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యాయి. ఎందరో కలల ఆశా సౌధం కూలిపోయింది. కొందరు కేటుగాళ్ల మూలంగా వైద్యవిద్య అభ్యసించి ఉన్నత శిఖరాలకు అందుకోవాలన్న కల ఫలించని పరిస్థితి ఏర్పడింది. ఎంసెట్‌ ఉంటుందా పోతుందా అన్నది పక్కన పెడితే ఇప్పుడు పరీక్ష రద్దు చేస్తే ఏంటన్న ఆందోళన వేలాదిమంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధిస్తోంది. దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వ అసమర్థత కారణంగా పేపర్‌ లీ2కయితే..దీనికి విద్యార్థులు బాధ్యత వహించాలా? ఇప్పటికే చదివిన చదువుల వల్ల ఎందరో తమకు సీట్లు వస్తాయని గట్టి విశ్వాసంతో ఉన్నారు. అలాంటి వారికి ఎవరు సమాధానం చెబుతారు. మళ్లీ పరీక్ష పెడితే టెన్షన్‌లో వీరు సరిగా రాయలేకపోతే అందుకు బాధ్యత ఎవరు తీసుకుంటారు.? గతంలో పరీక్షాపత్రాల లీకేజీ వ్యవహారం కుదుపులు ఉన్నా ఎందుకు నిఘా పెంచలేదు. ఎందుకు గట్టి చర్యలు తీసుకోలేదు? దీనికి ఎవరు సమాధానం చెబుతారన్నది ముఖ్యం. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు బలికావాల్సిందేనా అన్నది ప్రభుత్వాలే ఆలోచించి సమాధానం చెప్పాలి. తాజాగా నిర్వహించిన మెడికల్‌ ఎంసెట్‌-2ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తే తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ముఖ్యం. లీకేజీతో సంబంధం లేకుండా పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఎలాంటి భరోసా ఉంటుందన్నది ముఖ్యం. ప్రశ్నపత్రం బహిర్గతమైనట్లు సీఐడీ దర్యాప్తులో నిగ్గు తేలింది. విచారణలో ఎంసెట్‌-1 మెడికల్‌ ప్రశ్నపత్రం కూడా లీకైనట్లు వెల్లడికావడంతో ఆ పరీక్షనూ రద్దు చేయాలని యోచిస్తోందని సమాచారం. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతను చేపట్టిన హైదరాబాద్‌ జేఎన్‌టీయూ సక్రమ నిర్వహణ చేయకపోవడం వల్లనే దుష్ఫలితాలు వచ్చాయి. ప్రశ్నపత్రం రూపకల్పన, ముద్రణ, పరీక్ష నిర్వహణ, ర్యాంకుల వెల్లడి తదితరాలన్నీ ఈ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలోనే జరిగాయి. ర్యాంకుల వెల్లడి తర్వాత ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుర్వేద, ¬మియో తదితర వైద్యవిద్య సీట్ల భర్తీ వ్యవహారాలను కాళొజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఆధ్వర్యాన జరగాల్సి ఉంది. ఇంతలోనే లీకేజీ బాంబు బద్దలయ్యింది. దీంతో వందలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రలు హతాశులయ్యారు. నిబంధనల ప్రకారం సెప్టెంబరు 30లోగా అన్ని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లను భర్తీచేసేయాలి. ఎంసెట్‌-2 ర్యాంకులు ఇటీవలే వెల్లడి కావడంతో, కౌన్సెలింగ్‌ నిర్వహణకు కాళొజీ వర్సిటీ ఏర్పాట్లు కూడా చేసింది. ఇంతలో ఎంసెట్‌ ప్రశ్నపత్రాలు బహిర్గతమైనట్లు సీఐడీ నిర్ధారించడంతో, పరీక్షలను రద్దు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. లీకేజీ బహిర్గతం కావడంతో తాజాగా ప్రకటనను విడుదలచేసి, మళ్లీ దరఖాస్తులను స్వీకరించి, పరీక్ష నిర్వహించాల్సిందేనని అంటున్నారు. అక్రమంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను పక్కనపెట్టి, న్యాయబద్ధంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులతో కౌన్సెలింగ్‌ను కొనసాగించడం సాధ్యంకాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరీక్షలను రద్దు చేయకుండా అక్రమ ర్యాంకులను మాత్రమే రద్దుచేస్తే.. తర్వాత న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందనీ, పరీక్షలను రద్దుచేసి తాజాగా మరో ఎంసెట్‌ను నిర్వహించడమే మేలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చిందని సమచారం. ఇంతవరకు బాగానే ఉన్నా మరి నష్టపోతున్న విద్యార్థుల సంగతేంటన్నది తెలియదు. ఎంతో కష్టపడి చదవుకున్న విద్యార్థులేఊ ఇప్పుడ బాధపడేది. ర్యాంకులు రాని విద్యార్థులకు ఇదో అవకాశంగా మారనుంది. ర్యాంకులు వచ్చిన వారు మళ్లీ ర్యాంకులు సాధిస్తామో లేదో అన్న ఆందోళనలో ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు పరీక్ష నిర్వహించినా మరో నెలపాటు ప్రక్రియ జరుగనుంది. ప్రకటనను జారీచేసింది మొదలు ర్యాంకుల వెల్లడి వరకు మొత్తం పక్రియనంతా పూర్తిచేయడానికి కనీసం 40 రోజులు అవసరమని జేఎన్‌టీయూ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం వైద్యవిద్య సీట్ల భర్తీపై పడుతుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. నిజానికి గతంలో పట్టుబడ్డ వారిపై నిఘా పెట్టకపోవడం, వారిని ఉదారంగా వదిలేయడం వల్ల ఇలాంటి దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక పెద్ద ముఠా హస్తమే ఉందని తెలుస్తోంది. ఈ భారీ కుంభకోణంలో రాజగోపాల్‌ రెడ్డి అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన నిందితులను సీఐడీ అదుపులోకి తీసుకుంది. కేసు నమోదు చేసిన మూడు రోజుల్లోనే సీఐడీ మొత్తం కుట్రను ఛేదించింది. కుట్రదారులతో ఒప్పందం కుదర్చుకొని డబ్బు చెల్లించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిందితులుగా ఈ కేసులో చేర్చనున్నారు. గతంలో ట్రాక్‌ రికార్డు ఉన్న రాజ్‌గోపాల్‌ రెడ్డిపై ఉదాసీనంగా ఉండడమే ఇప్పుడు కొంప ముంచింది. దీనిపై ముందే చర్యలు తీసుకుని ఉంటే ఇంతదాకా వచ్చేది కాదు. ఇలాంటి వారివల్ల విద్యార్థులు బలి కావాల్సిందేనా? వారికి అండగా నిలిచేది ఎవరు. సర్కార్‌ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఎందుకు బలి కావాలి. ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇకముందయినా పక్కా చర్యలు తీసుకోవాలి. నిందితులను కఠినంగా శిక్షించడం ద్వారా భవిష్యత్‌లో ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా చూడాలి.