ఎఫ్‌డీఐలపై అమెరికా ఒత్తిడి లేదు: ప్రధాని
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 (జనంసాక్షి) : ఆర్థిక సంస్కరణలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తిప్పికొట్టారు. దేశానికి ఏది మంచో అది చేయడం ప్రభుత్వ బాధ్యత అని, తాము అదే చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఎవరు ఒత్తిడి తీసుకురాలేనని అన్నారు. ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తూనే.. ప్రభుత్వం సంస్కరణల ప్రక్రియను కొనసాగిస్తుం దన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో భాగస్వామ్య పక్షాలు సహకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆల్తమస్ కబీర్ ప్రమాణ స్వీకరోత్సవానికి హాజరైన ప్రధాని మన్మోహన్‌సింగ్ శనివారం విూడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలపై వస్తున్న విమర్శలు, డీజిల్ ధర పెంపు, వంటగ్యాస్‌పై పరిమితి విధింపు సహా ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని వస్తున్న డిమాండ్లపై ప్రధాని స్పందించారు. సంస్కరణలు ఎన్నికల్లో గెలిపించలేవని ఇటీవల జరిగిన యూపీఏ సమన్వయ కమిటీ భేటీలో మిత్రపక్షాలు లేవనెత్తిన అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకురాగా.. అన్ని అంశాలపై సమావేశంలో చర్చించామని చెప్పారు. తాము ఎన్నికల నుంచి పారిపోమని బదులిచ్చారు. దేశానికి ఏది మంచో ప్రభుత్వం అదే చేస్తుందని, సంస్కరణలు కూడా అందులో ఓ భాగమని మన్మోహన్ తెలిపారు. మరిన్ని సంస్కరణలు చేపడతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమేనని స్పష్టం చేశారు. భారత్ స్వతంత్ర దేశమని, ఎవరి ఆదేశాలనూ పాటించడం లేదన్నారు. అమెరికా ఒత్తిడితోనే యూపీఏ ప్రభుత్వం రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించిందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం విమర్శలు చేసిన నేపథ్యంలోనే ప్రధాని స్పందించినట్లు సమాచారం. ‘అసలు భారతదేశంలో సంస్కరణల గురించి అమెరికాకు ఏమిటి సంబంధం?’ అని ప్రధాని ప్రశ్నించారు. ‘ఈ విషయంలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో ఏదో చెబితే అది పాటించడానికి ఇక్కడెవరు లేరు. బయటి వారు ఏది చెబితే అది చేయడానికి భారత్ సిద్ధంగా లేదు’ అని అన్నారు. ప్రభుత్వంపై ఎవరి ఒత్తిడీ లేదని మన్మోహన్ స్పష్టం చేశారు. సంస్కరణల అమలు కొనసాగుతుందన్నారు.
ఇటీవలే యూపీఏ నుంచి వైదొలిగిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ప్రధానిపై తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలను ప్రస్తావించగా.. బదులిచ్చేందుకు మన్మోహన్ నిరాకరించారు. విమర్శలను తాను సమాధానివ్వబోనని స్పష్టం చేశారు. సహజ వనరులపై సుప్రీంకోర్టు రెండ్రోజుల క్రితం వెలువరించిన తీర్పును ఆయన స్వాగతించారు. సుప్రీం తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.