భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడేవరకు కశ్మీర్‌లో మిలిటెన్సీ అంతం కాదు..
` ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర, వేర్పాటువాద కార్యకలాపాల విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడేవరకు జమ్మూకశ్మీర్‌లో ఈ సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. స్థానికంగా మిలిటెన్సీ అంతమైందనే వాదనలపై షోపియాన్ జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ ఇంకా అంతం కాలేదు. కాబోదు కూడా. పొరుగుదేశంతో సంబంధాలు మెరుగుపడేవరకు దీనికి పరిష్కారం దొరకదు. స్థానికంగా ఉగ్రస్థావరాలను నిర్మూలించామని కేంద్రం గతంలో ప్రకటించింది. మరి అటువంటప్పుడు ప్రస్తుతం కుల్గాం ఎన్‌కౌంటర్ ఎందుకు జరుగుతోంది? ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్య లేదని ఎలా చెప్పగలరు?’’ అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. మిలిటెన్సీ ముగిసిందని తానెప్పుడూ చెప్పలేదన్నారు.జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు మంగళవారంతో ఆరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్ధరిస్తారంటూ కేంద్రాన్ని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఈ ఆరేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారన్నారు. ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు (జమ్మూకశ్మీర్, లద్దాఖ్)గా విభజించింది.