కవిత భూక్ హడ్తాల్..
` బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యం
` ఇందిరాపార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష
` కోర్టు అనుమతి నిరాకరణతో విరమణ
హైదరాబాద్,ఆగస్ట్4(జనంసాక్షి):ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈ నిరాహార దీక్షకు కోర్టు అనుమతి నిరాకరించిందని చెప్పారు. దీంతో తాను చేపట్టిన ఈ దీక్షను విరమిస్తున్నట్లు- తెలిపారు. కోర్టులను ధిక్కరించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కోర్టుల పట్ల తనకు గౌరవం ఉందన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపుతూ.. బీసీల తరఫున పోరాటం చేస్తున్నామని చెప్పారు. మేము ఒక్క అడుగు వెనక్కి వేస్తే.. 10 అడుగులు ముందుకు వేస్తామని కవిత చెప్పారు. కోర్టు తీర్పును గౌరవించి ఈ దీక్షను ఇంతటితో ముగిస్తున్నామన్నారు. ఈ పోరాటం ఆగదని.. అనేక రూపాల్లో చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలతో సాధించేది ఏం లేదన్నారు. విూరు రాష్ట్రపతి వద్దకు వెళ్లండంటూ తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలకు ఆమె సూచించారు. అంతకుముందు ఆమె ఇందిరాపర్క్ వద్ద దీక్షకు దిగారు. తెలంగాణ జాగృతి ఈరోజు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్, ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. కార్యక్రమానికి పెద్దఎత్తున కార్యకర్తలు, తెలంగాణ జాగృతి శ్రేణులు తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రాజ్యాధికారంలో వాటా కావాలి, ఆర్థిక అవకాశాలు రావాలి. సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారు. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాం. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతున్నాం. అందరి ఆకాంక్ష ఒకటే.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం భాజపా విూద నెపం పెట్టి తప్పించు కోవాలని చూస్తోంది. బీసీ బిల్లుపై భాజపా లేవనెత్తిన అనుమానాలను సీఎం నివృత్తి చేయాలి. ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి హావిూ ఇవ్వాలి. ముస్లింలను మినహాయించి బీసీలకే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పాలి. అప్పుడు భాజపా ఎందుకు ఒప్పుకోదో మేమూ చూస్తాం. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌కు ప్రత్యేకంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇందుకు కృషి చేయాలని కవిత అన్నారు.
కవిత బీసీ రిజర్వేషన్ల ధర్నా ఓ జోక్
` మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య
నల్లగొండ,ఆగస్ట్4(జనంసాక్షి):బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీ ధర్నా జోక్ అని ఎద్దేవా చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కోట్లాడుతాం అని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం చేస్తా అని కవిత తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ విూడియాలో వైరల్ అయ్యాయి.నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. మినిస్టర్ క్యాంప్ ఆఫీస్‌కు ఇందిరా భవన్‌గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ’క్యాంప్ ఆఫీస్‌కు ఇందిరా భవన్‌గా నామకరణం చేశాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో మొదటి ఏడాది నేను బాధపడ్డాను. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అందరూ సమానమే. నల్లగొండ జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్ట్ లను ఏడాదిలో పూర్తి చేస్తాం’ అని మంత్రి చెప్పారు.కేబినెట్‌లో జరగబోయే చర్చపై నేను ముందుగా మాట్లాడను. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ నిందితులు జైలుకు వెళ్తారు. నా ఫోన్ ట్యాప్ కాలేదు. ఎపి తలపెట్టిన బనకచర్ల కట్టనివ్వం. కాళేశ్వరం నివేదికపై కేబినెట్‌లో సమగ్రంగా చర్చిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు, ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నాం. కవిత ఎవరో నాకు తెలియదు. కవిత బీసీ ధర్నా జోక్. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కొట్లాడుతాం. ఆర్డినెన్సును సాధిస్తాం. నారా లోకేష్‌కు రాజకీయ అవగాహన లేదు. భనకచర్లపై అవసరమైతే కేంద్రంపై కొట్లాడుతాం. బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటాం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న సందర్బంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. మినిస్టర్ క్యాంప్ ఆఫీస్‌కు ఇందిరా భవన్‌గా నామకరణం చేశారు. ఆపై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను, భూమి పూజకు సంబంధించిన వివరాలను సీఎంకు మంత్రి వివరించారు. స్కూల్ నిర్మాణ పనులకు భూమి పూజ, క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్‌మారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కందూరు జైవీర్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి ఫోన్ చేయగా.. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు. విూరు మరలా సీఎం కావాలని ప్రత్యేక పూజలు చేశా అని సీఎంకు మంత్రి తెలిపారు. అందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఆపై మిగతా ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ విూడియాలో వైరల్ అయింది. నల్గొండలో 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రే-టె-డ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను నిర్మిస్తున్నారు. తెలంగాణ విద్యా రంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రే-టె-డ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా విప్లవాత్మక మార్పు ప్రారంభం కానుంది. పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ-పడాలన్న లక్ష్‌యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు- మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఇక్కడ ఉంటాయని చెప్పారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
5.కవితది నాటకమే
` తప్పుపట్టిన భాజపా..
హైదరాబాద్,ఆగస్ట్4(జనంసాక్షి):కేవలం బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే భాజపా పూర్తి మద్దతిస్తుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. ఇందులో ముస్లిం రిజర్వేషన్లను అంగీకరించబోమని అన్నారు. సోమవారం విూడియాతో ఆయన మాట్లాడుతూ.. దిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో చేసినట్లే దిల్లీకి వెళ్లి నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10శాతం ఇస్తామని చెప్పలేదు. బీసీలకే 42 శాతం అమలు చేస్తామంటే పూర్తి మద్దతిస్తాం. ముస్లింలకు 10 శాతం ఇస్తే.. 10 శాతం బీసీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లను భాజపా అడ్డుకుంటోందని ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్‌ను బీసీలు నమ్మరని అన్నారు. బిసిల పేరు చెప్పి ముస్లింలకు ఇచ్చే కుట్రలను అడ్డుకుంటామని అన్నారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేదని రామచందర్‌రావు అన్నారు. ముస్లింలకు 10 శాతం ఇస్తే, పదిశాతం బిసిలకు అన్యాయం జరుగుతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే పాత రిజర్వేషన్లే కొనసాగించాలనేది ఉద్దేశం అని రామచందర్ రావు పేర్కొన్నారు.