ఏ సమస్య వచ్చినా 1100 నెంబర్‌కు ఫోన్‌ చేయండి

అభివృద్ధికి పట్టుగొమ్మలుగా గ్రామాలు 
ప్రకాశం పర్యటనలో సిఎం చంద్రబాబు
ఒంగోలు,మే17(జ‌నం సాక్షి ): ప్రజలు ఏ సమస్య వచ్చినా 1100 నెంబర్‌కు ఫోన్‌ చేసి సలహాలు పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన ప్రకాశం జిల్లాలోని బడేవారిపాలెం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… గ్రామాలు అభివృద్ధికి పట్టుగొమ్మలుగా ఉండాలన్నారు. అలాగే అధికారులు సక్రమంగా పనిచేయాలని, పశువుల సంరక్షణకు గోకులాలను ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. కాగా… బడేవారిపాలెంలో ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోకూరు చెరువులో పూడికతీత పనులను సీఎం పరిశీలించారు. చెరువు పూడికతీత పనుల్లో సీఎం స్వయంగా జేసీబీ నడిపారు. అనంతరం పోకూరులో ఆయకట్టు రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లాను కరువు రహితంగా మారుస్తామన్నారు. జిల్లాలోని చెరువుల్లో నీటి నిల్వ సామర్ధ్యం పెంచుతున్నామని, తద్వారా నీటి నిల్వతో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు.రాళ్లపాడు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పెండింగ్‌ పనులను పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్‌ నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శిద్దా, దేవినేని ఉమ, నారాయణ హాజరయ్యారు. ఇదిలావుంటే రాజధాని అమరావతి నిర్మాణానికి ఓ గ్రామస్తుడు రూ. 5లక్షల విరాళాన్ని అందజేశాడు. ప్రకాశం జిల్లాలోని బడేవారిపాలెం గ్రామంలో గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయా కార్యక్రమాలను ప్రారంభించిన చంద్రబాబు… పైలాన్‌ ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రజలను ఆయా సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. కాగా… పింఛన్లు సక్రమంగా పంపిణీ చేస్తున్న కార్యదర్శిని సీఎం అభినందించారు. అలాగే చంద్రన్నబీమా లబ్ధిదారులతో మాట్లాడారు. కాగా… అదే గ్రామానికి చెందిన ఇంటూరి నరసయ్య అనే వ్యక్తి రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 5లక్షల విరాళాన్ని చంద్రబాబుకు అందజేశారు.

తాజావార్తలు