బీసీఓట్లకు గాలం
` అందుకే కులగణన:కేటీఆర్
హన్మకొండ(జనంసాక్షి):కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది అయిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హావిూలు ఏమయ్యాయని ప్రశ్నించారు? హనుమకొండలో నిర్వహించిన భారాస నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తిదారుల గొంతు కోశారని విమర్శించారు.’’కొత్త పథకాల మాట దేవుడెరుగు.. ఉన్న పథకాలకే పాతరేశారు. రేవంత్ ప్రభుత్వం రాగానే.. బీసీ బంధు, రైతు బంధును బంద్ చేశారు. బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ కులగణన జపం ఎత్తుకుంది. కులగణనలో 175 ప్రశ్నలు అడుగుతున్నారు. బ్యాంకుల్లో డబ్బెంత ఉంది? ఏసీ ఉందా? ఫ్రిజ్ ఉందా? అని అడుగుతున్నారు. కులగణన కోసం వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.బీసీల ఓట్ల కోసం అధికారులను బలిపశువులను చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హావిూ ఇచ్చింది. అవి ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా.. కాంగ్రెస్ ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేదు. కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వశాఖ ఉండాలని గతంలో కేసీఆర్ కోరారు. కాంగ్రెస్ నేతల చిత్తశుద్ధిని ప్రజలు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన ప్రస్తావన తీసుకొచ్చారు’’ అని కేటీఆర్ విమర్శించారు.