కలెక్టర్ సార్” బెల్ట్” తీయరా…

 “వట్టి”వారి గట్టి దందా.

-మణుగూరు పినపాక మండలాలలో బెల్ట్ షాపుల జోరు.

-మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు.

-మన్యంలో మాటేసిన మద్యం డాన్ల కనుసన్నల్లో విధులు.
-బాటిల్ పై అదనంగా రూ.20 వసూళ్లు చేస్తున్న వ్యాపారులు.
జనంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 6:- పట్టణ ప్రాంతాల్లో
ఉండాల్సిన మద్యం దుకాణాలు నేడు పల్లెల్లో గల్లీకొకటి వెలుస్తున్నాయి. మద్యం విక్రేతలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో బెల్టుషాపులతో మద్యం ఏరులై పారుతోంది. బెల్టుషాపులు లేవని అధికారులు చెబుతున్న అవి కాకి లెక్కలకె పరిమితమవుతున్నాయి. నూతన ఎక్సైజ్ మద్యం పాలసీ ప్రకారం ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా, కల్తీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో బెల్టుషాపు నిర్వాహకులకు హద్దు లేకుండా పోతుంది. దీంతో వారి వ్యాపారం మూడు క్వాటర్లు, ఆరు బీర్లుగా కొనసాగుతోంది. వట్టి వారి మద్యం దుకాణాలకు పరోక్షంగా ఎక్సైజ్ శాఖ అధికారుల సహకరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే అధికారుల తీరు విమర్శిస్తున్నారు.
ప్రతి గ్రామంలో 10 నుంచి 20 వరకు బెల్ట్ షాపులు ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే 24 గంటలు మద్యం ఏరులై పారుతూ అమ్మాయి ఆదివాసి గిరిజన ప్రాంతాల ప్రజలు రెక్కల కష్టాన్ని దోచుకున్నారు. మణుగూరు, పినపాక మండలంలోని పలు గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు: చేసుకున్న బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్న ఇద్దరు మద్యం డాన్ లు ఇష్టారీతిలో నిబంధనలు అతిక్రమిస్తూ గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యాన్ని తరలిస్తూ అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్యం నూతన మద్యం పాలసీ ప్రకారం గతంలో కంటే ఈ ఏడాది మద్యం షాపుల సంఖ్య పెరిగింది. దీంతో పినపాక మండలంలో 3 మద్యం దుకాణాలు ఏర్పాటు అయ్యాయి. వీటి నుంచి బాటిల్పై ఎమార్చీకి అదనంగా విక్రయాలు చేస్తున్నారు. పల్లెల్లో బెల్ట్ షాపుల వ్యాపారులు బాటిల్ పై రూ.25 అదనంగా వసూళ్లు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. అయినా ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ అధికారులు మద్యం డాన్లు ఇస్తున్న మామూళ్లు తీసుకుంటూ పల్లెల్లో బెల్ట్ దుకాణదారులకు సహకరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం బెల్ట్ షాప్ల ద్వారా మద్యం విక్రయాలు జరపకూడదు. బయట ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయించ రాదనే ఆదేశాలు ఉన్నాయి. కానీ మణుగూరు, పినపాక మండలాలలో వట్టి వారిదే గట్టి దందా.
మద్యం సిండికేట్ వ్యాపారులు వెదజల్లే ముడుపుల మూటల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులకు ఏమి పట్టడం లేదు.  షాప్ నిర్వహించాలంటే ఎన్నో నిబంధనలు, లైసెన్స్, పర్మిషన్ లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. వైన్ షాప్ యాజమానుల నుంచి పోలీస్ అధికారులు మామూళ్లు తీసుకుంటూ బెల్ట్ షాపుల వ్యవహారంపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు మద్యం డాన్లు కనుసన్నల్లో మద్యం. వ్యాపారులు సిండికేట్ అయి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ఉంటే ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. బెల్ట్ షాప్ నిర్వహణతో ఇరుగు పొరుగున ఉండే ఎంతోమంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ సిఐ కి పలుమార్లు బెల్టుషాపుల విషయం వారికి తెలియజేయడానికి చరవాణిలో ప్రయత్నించిన ఆ సీఐ అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైనా   మణుగూరు నుండి పినపాక మండల వ్యాప్తంగా జాతీయ రహదారి వెంబడి ఉన్న మణుగూరు ,విజయనగరం, రామన్ జరం, సాంబయ్య గూడెం, చిక్కుడు గుంట, బి టి పి ఎస్ ప్లాంట్ ఎదురుగా ఉన్న బెల్ట్ షాపులు, బయ్యారం క్రాస్ రోడ్ నుండి దుగినేపల్లి వరకు విస్తరించి ఉన్న బెల్ట్ షాపులపై బెల్టు తీయాలని ప్రజలంతా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ని వేడుకుంటున్నారు.