పెద్ద ధన్వాడలో తీవ్ర ఉద్రిక్తత

రాజోలి, జూన్ 04 (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. బుధవారం ఉదయం పోలీసుల బందోబస్తుతో ఒక్కసారిగా గ్రామాల్లోకి వచ్చి గ్రామస్తులను నిర్బంధించారు. ఈ నిరసనకు రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసనలు చేపడుతున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని, ఈ అంశంపై ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులను నిరసనకారులు ఎదురించడం.. ఇథనాల్ ఫ్యాక్టరీనా.. మేమా? ఏదో ఒకటే ఉండాలన్నట్లుగా భీష్మించడంతో వారికి సర్థిచెప్పలేక పోలీసులు వారిని చదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నిరసనకు వచ్చే అఖిలపక్షం నాయకులను, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు.