కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

– ప్రపంచమే అబ్బురపడేలా రైతుబంధు
– బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి పథకాలు ఎందుకులేవు?
– రైతుబంధుపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటు
– మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
– సత్తుపల్లి గంగారంలో చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు పోచారం, మహమూద్‌అలీ, తుమ్మల
ఖమ్మం, మే12(జ‌నం సాక్షి ) : తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి దేశవ్యాప్తంగా కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుందని, తాజాగా రైతుబంధు పథకంతో ప్రపంచమే అబ్బురపడుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని గంగారంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పోచారం పాల్గొన్నారు. ఈసందర్భంగా రైతులకు చెక్కులు, పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. రైతుల బతుకులు బాగుపడాలన్న చిత్తశుద్ధితో కేసీఆర్‌ రేయింబవళ్లు కష్టపడి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలో 29 రాష్ట్రాలుంటే నేడు ప్రతీ రాష్ట్రం తెలంగాణవైపే చూస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతిని అడ్డుకోవాలని కాంగ్రెస్‌, బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంటరుణాలు ఎందుకు మాఫీ చేయలేదనీ, ఆయా రాష్ట్రాల్లో నాణ్యమైన ఉచితవిద్యుత్‌ను ఎందుకు సరఫరా చేయడం లేదని నిలదీశారు. రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులు రికార్డు సృష్టించారని పోచారం అన్నారు. ఉద్యమనేతగా కేసీఆర్‌కు ఉన్న అనుభవం, రైతుబిడ్డగా ఆయనకున్న ఆలోచన ఫలితంగానే సంక్షేమ
పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయని పోచారం పేర్కొన్నారు. మరో ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా భూరికార్డుల ప్రక్షాళన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలో నంబర్‌వన్‌ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నదని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1200 కోట్లు కేటాయించి, ఎకరాకు ఒక పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు రెండు పంటల బడ్జెట్‌ను కేటాయించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. రైతులు బ్యాంకులు, వడ్డీవ్యాపారుల వద్దకు అప్పుల కోసం వెళ్లకుండా చేసేందుకు ఈ పథకాలు రూపొందించారని చెప్పారు. రికార్డుల ప్రక్షాళనతో రైతు సంక్షేమం మరింత పెరిగిందన్నారు. 18 సెక్యూరిటీ ఫీచర్లతో పాస్‌బుక్కు పంపిణీ చేయడం కూడా దేశంలోనే మొదటిదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ బ్యాంక్‌ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, జడ్పీ చైర్మన్‌ కవిత, తెరాసనేతలు, అధికారులు పాల్గొన్నారు.