కోటకట్ట చెరువు నిర్మాణం చేపట్టాలని సిపిఐ పాదయాత్ర

యర్రగొండపాలెం , జూలై 23 : నల్లమల అటవీప్రాంతంలోని శ్రీకృష్ణదేవరాయ కాలంలో నిర్మించిన కోటకట్ట చెరువు పునర్నిర్మించాలని యర్రగొండపాలెం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాధ్‌ ప్రారంభించారు. ఆదివారం యర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లిలో ఈ యాత్రను ఆయన ప్రారంభించి ప్రసంగిస్తూ ఈ చెరువు గతంలో సుమారు నల్లమల అటవీప్రాంత సమీప గ్రామాలకు జీవనాధారంగా ఉందని, కాలక్రమేణా ఈ చెరువు తెగిపోవడంతో ఆనాటి బ్రిటీష్‌ ప్రభుత్వం నేటి పాలకులు పట్టించుకోలేదని ఈ చెరువు నిర్మాణం వలన సుమారు రెండు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, పది గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి త్రాగునీటి సమస్య శాశ్శిత పరిష్కారానికి నోచుకుంటుందని, గతంలో సిపిఐ ఆందోళన చేపట్టడం వలన అటవీశాఖ, ఇరిగేషన్‌ అధికారులు జాయింట్‌ తనిఖీ నిర్వహించారని అనంతరం పనులు చేపట్టడంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఈ చెరువు నిర్మాణం వలన గంజివారిపల్లి, వెంకటాద్రిపాలెం, వీరభద్రాపురం, గడ్డమీదపల్లి, కొలుకుల, వీరయ్యపాలెం, సాయిబాబానగర్‌, యర్రగొండపాలెం, గాంధీనగర్‌ అంకమ్మ గూడాల్లో సాగునీటి సమస్య తీరుతుందని, మరో నాలుగు గ్రామాలకు పూర్తి తాగునీరు అందుతుందని ఆయన వివరించారు. కేవలం 300 ఎకరాల అటవీశాఖ అనుమతులు లేక ఈ ప్రాజెక్టు ఆగిందని, ఇరిగేషన్‌శాఖ అధికారులు చెబుతున్నా అటవీశాఖ అధికారులు ఇరిగేషన్‌శాఖ అధికారులపై ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ ప్రాజెక్టు నిర్మాణాన్ని జాప్యం చేస్తున్నారని రవీంద్రనాధ్‌ విమర్శించారు. వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఐ పాదయాత్ర చేపట్టిందని అన్నారు. ఈ పాదయాత్ర బృందంలో సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కెవివి ప్రసాద్‌, సిపిఐ జిల్లా నాయకులు టిసిహెచ్‌ చెన్నయ్య, కెవి కృష్ణగౌడ్‌, గాలి సుబ్బరాయుడు, గురునాధం, పి వెంకటేశ్వర్లు, యోగయ్య, జి శ్రీను, తిరుపతయ్య, సుబ్బారెడ్డి, మూలా వెంకటరెడ్డి, రాతం వీరయ్య, కె పెద్దన్నలు ఉన్నారు. ఈ బృందానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కెవివి ప్రసాద్‌, టిసిహెచ్‌ చెన్నయ్యలు నాయకత్వం వహించారు. ఈ పాదయాత్ర బృందం గంజివారిపల్లిలో బయలుదేరి వెంకటాద్రిపాలెం, వీరభద్రాపురం గ్రామాల్లో పర్యటించి గ్రామ సభలు నిర్వహించి రాత్రికి గడ్డమీదిపల్లి గ్రామంలో బహిరంగసభ నిర్వహించింది.