కోరిన వెంటనే సమాచారమివ్వండి
కడప, జూలై 27: గడువుతో నిమిత్తం లేకుండా సమాచారాన్ని కోరిన వెంటనే కోరిన వారికి ఇవ్వాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీరతన్ అన్నారు. సమాచార హక్కు చట్టం పరిరక్షణ, అమలు, తదితర అంశాలపై శుక్రవారంనాడు కడప సభా భవనంలో అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమాచారం రికార్డుల మేరకే ఇవ్వాలని, అనవసర మైన అంశాలను అందులో చేర్చరాదని ఆయన సూచించారు. వాస్తవ విషయాలను మాత్రమే సమాచార వెబ్‌సైట్‌లో ఉంచాలని, అన్ని ప్రభుత్వశాఖలు ఈ విధానాలను అనుసరిస్తే దరఖాస్తు అందిన వెంటనే సమాచారాన్ని ఇచ్చే వీలు ఉంటుందని ఆయన చెప్పారు. దేశభద్రతకు ఇతర నిగూఢమైన శాఖలు మినహాయించి ప్రధానమంత్రి నోట్ ఫైల్‌ను కూడా ఈ చట్టం కింద ఇవ్వవచ్చని చెప్పారు. కేసులకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో కాకుండా చార్జిషీటు దాఖలైన అనంతరం సమాచారాన్ని ఇవ్వవచ్చన్నారు. తెలుగులో మాత్రమే సమాచారం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో సమాచార హక్కు చట్టం కింద 452 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్ దరఖాస్తులు జిల్లాకు సంబంధించి చాలా తక్కువ ఉన్నాయని అన్నారు. సమాచారం ఇవ్వనందుకు ఇటీవల ఒక అధికారికి 85వేల రూపాయల జరిమానా విధించామన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.