కోల్డ్ స్టోరేజీల నిర్మాణంతోనే సమస్యలకు చెక్
ఖమ్మంపై ఒత్తిడి తగ్గించే చర్యలు చేపట్టాలని వినతి
ఖమ్మం,మే5(జనం సాక్షి): తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు తర్వాత మిరప అధికంగా వచ్చే మార్కెట్ ఖమ్మం కావడంతో ఇక్కడికే మిర్చి రైతులు తమ పంటను తీసుకుని వస్తున్నారు. అయితే ఇక్కడ కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడం వల్లనే రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వడగళ్లు, వర్షాలు వచ్చినప్పుడు దాచుకునేలా సౌకర్యాలు లేవని వాపోతున్నారు. పంటలను నిల్వ చేసుకునే సౌకర్యం ఉంటే పరిస్థితి మెరుగు కాగలదని అంటున్నారు. వెంటనే ఇక్కడ పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేయాల్సి ఉంది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఇదే విషయాన్ని పలుమార్లు కేంద్రానికి లేఖల ద్వారా తెలియచేశారు. సీజన్లవారీగా, పంటలవారీగా సరైన ప్రణాళిక తయారు చేసి అన్ని మార్కెట్లలో క్రయవిక్రయాలు జరగటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నప్పుడే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో కూడా ఇదొకటి కావడం విశేషం. ఇక్కడ పంట పండించే రైతులందరికీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ దిక్కు కావడంతో అంతా ఇటే తరలివస్తున్నారు. మిరప, పత్తి పంటల కొనుగోలుకు ఖమ్మం ప్రధాన మార్కెట్. ఈ రెండు పంటల సరుకులను వ్యాపారులు కొనుగోలు చేసి దేశీయ అవసరాలకు పలు రాష్ట్రాల్లో విక్రయించడంతో పాటు విదేశాలకు కూడా భారీగా ఎగుమతి చేస్తున్నారు. రోజుకు లక్ష బస్తాలపైన వస్తుండడంతో పరిసర
ప్రాంతాల ప్రజలు ఘాటుతో తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు గిట్టుబాటు ధర రాక రైతులు విలవిల లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయటం లేదు. ఇతర
మార్కెట్లను అభివృద్ధి చేయటంపై మార్కెటింగ్‌శాఖ దృష్టి పెట్టినట్లు లేదు. రెండు జిల్లాల్లోని మరో 12 వ్యవసాయ మార్కెట్లలో కూడా మిరప కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌పై రద్దీ తగ్గుతుంది. అపరాలను కూడా ఇక్కడ కొనుగోలు చేసి ఇతర రాష్టాల్రకు ఎగుమతి చేసే సామర్థ్యం కలిగిన వ్యాపారులు ఇక్కడ ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 13 వ్యవసాయ మార్కెట్లు ఉంటే రెగ్యులేటెడ్ మార్కెట్ ఇదొక్కటే. లక్షల మంది రైతుల సరుకు విక్రయానికి ఈ మార్కెట్ ఒక్కటే దిక్కు
కావడంతో దీనిపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. దీంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. భారీగా వస్తున్న మిరప నిల్వ చేసుకోడానికి శీతల గిడ్డంగుల్లో కూడా ఖాళీ లేదు. ఇళ్లలో స్థలం లేక, కళ్లాలో నిల్వ ఉంచలేక రైతులు మార్కెట్లో అతి తక్కువ ధరకు తెగనమ్ము కుంటున్నారు. ఖమ్మంలో జిల్లా కేంద్రంతోపాటు నేలకొండపల్లి, మధిర, వైరా, ఏన్కూరు, కల్లూరు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, దమ్మపేట, భద్రాచలం, వెంకటాపురం వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. ఒక్క ఖమ్మంలోనే వేసవిలో 15 రోజులు తప్ప ఏడాది పొడవునా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతుంటాయి. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం మొదలుకొని ఇతర ప్రాంతాల నుంచి ప్రస్తుతం మిరపని రైతులు ఇక్కడికే తీసుకొస్తున్నారు. దీనికితోడు ఏపీలోని నూజివీడు, వత్సవాయి, నందిగామ తదితర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికే తెచ్చి విక్రయిస్తున్నారు. పొరుగునే ఉన్న సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి కూడా నిల్వలు వస్తున్నాయి. దీంతో భారీగా మిరప ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పోటెత్తుతోంది. రెండు యార్డులు నిండటంతోపాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు ఐదారు వీధుల్లో బస్తాలు నిండిపోతున్నాయి. ప్రజలు నడవడానికి దారి కూడా ఉండటం లేదు. వెంకటాపురం, భద్రాచలం, బూర్గంపాడు మార్కెట్లలో మిరపను కొనుగోలు చేస్తే ఏజెన్సీ ప్రాంతంలోని రైతులకు వ్యయప్రయాసలు తప్పుతాయి. ఇల్లెందులో మార్కెట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని రైతులకు ప్రయోజనం జరుగుతుంది. మధిరలో కొనుగోళ్లు ప్రారంభించటం వల్ల బోనకల్లు, ఎర్రుపాలెం మండల రైతులతోపాటు పొరుగునే ఉన్న ఆంధప్రదేశ్‌లోని నందిగామ, నూజివీడు, వత్సవాయి ప్రాంత రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏన్కూరు, వైరా, సత్తుపల్లి, దమ్మపేటలో ఏర్పాటు చేయటం వల్ల పరిసర మండలాల రైతులకు ప్రయోజనం కలుగుతుంది.