క్షేత్రస్థాయిలో పంపిణీకి పక్కా చర్యలు: కలెక్టర్‌

కొత్తగూడెం,మే9(జ‌నం సాక్షి): భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరచనున్న రైతుబంధు పథకం చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు మరోమారు సవిూక్షించి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన పనులపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎ/-మెల్యేలు జలగం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు ఎక్కడిక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.రైతు సమన్వయ సమితి సభ్యులు ఇందుకు దగ్గరుండి సహకరిస్తారు. ఈనెల 10వ తేదీ నుంచి పారదర్శకంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.  ఇప్పటికే ఆయా మండలాల రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులతో అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.  ఏ రైతుకు మంజూరైన చెక్కును ఆ రైతుకే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. చెక్కుతో పాటు ఒక స్లిప్‌లో చెక్కు పొందిన రైతు బ్యాంక్‌కు వెళ్లే తేదీని కూడా ఖరారు చేసి ఇస్తామని తెలిపారు. సదరు రైతు స్లిప్‌లో ఉన్న తేదీన మాత్రమే బ్యాంక్‌కు వెళ్లి చెక్కును మార్చుకోవాలని అన్నారు. రైతులందరూ గ్రామాల్లోకి వచ్చిన వ్యవసాయశాఖ సిబ్బందికి సహరించాలని కోరారు.  అలాగే  కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతులకు పంపిణీ చేయుటకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.  ఈ క్రమంలో చెక్కులు, పాస్‌ పుస్తకాలు తహసీల్దార్‌ కార్యాలయాలకు చేరుకున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ మాసం వరకు రెవెన్యూ అధికారులు భూప్రక్షాళన కార్యక్రమం చేపట్టి వాటికి కొత్త పాస్‌ పుస్తకాలతో పాటుగా రైతుబంధు పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి రైతు తమ ఆధార్‌ కార్డు తమ వెంట తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. ప్రతి రైతు సహకరించాలని కోరారు.
——