గీత దాటిన వారిపై 15 రోజుల్లో చర్యలు

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతాం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌
హైదరాబాద్‌, మార్చి 16 (జనంసాక్షి):
ఏప్రిల్‌ చివరి వారంలో కాని, మే నెల మొదటి వారంలో కాని పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచన ప్రాయంగా వెల్లడించారు. ముందుగా సర్పంచుల ఎన్నికలకు వెళతామని, అప్పుడే పార్టీ సత్తా ఏమిటో తెలుస్తుందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలైనా, ఏ ఎన్నికలైనా కాంగ్రెస్‌ పార్టీ భయపడబోదని ఆయన స్పష్టం చేశారు.  శనివారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణ ఎన్నికలకు గీటురాయి అని ఆయన వ్యాఖ్యానించారు.  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వెనుకంజవేసేది లేదని అన్నారు. 2014 వరకు తమ ప్రభుత్వానికి ఢోకాలేదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా తమ పార్టీ భారీ మెజారిటీ విజయం సాధిస్తుందని చెప్పారు. రాజకీయ లబ్ధికోసమే టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌ సీపీలు అవిశ్వాసం పెట్టాయని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. అవిశ్వాసం సందర్భంగా ఎవరి సత్తా ఏమిటో తేలిపోయిందన్నారు. టీడీపీ మరో సారి అవిశ్వాసం పెడితే స్పీకర్‌ నిబంధనల మేరకు వ్యవహరిస్తారని తెలిపారు. స్థానిక ఎన్నికలు తరువాత తమ పార్టీలో   ఉండేదెవరో, పోయేదెవరో తెలుస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం మైనారిటీలో పడిందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమకు మెజారిటీ ఉందన్నారు.  నిన్న అవిశ్వాసం సందర్భంగా ఓటింగ్‌కు కొంతమంది హాజరు కాలేకపోవడం వల్లే తమ ప్రభుత్వం మైనారిటీలో పడిందని కొందరు భ్రమల్లో మునిగితేలుతున్నారన్నారు. తమ ప్రభుత్వం మనుగడకు వచ్చిన ముప్పేమిలేదన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ను ధిక్కరించిన వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 20న శాసనసభ పక్షం సమావేశమవుతుందని, దీనిలో గీత దాటిన ఎమ్మెల్యేలపై చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని  సీఎల్పీని ఆదేశించినట్టు చెప్పారు. దీనిపై సీఎల్పీయే తగిన కసరత్తు చేసి 15 రోజుల్లో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. అసమ్మతి గళం వినిపించిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరో అభ్యర్థిని నిలిపినా తాము గెలిచి ఉండేవారమని అన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు నిధులు ఇవ్వనని తానెక్కడా చెప్పలేదని అన్నారు. ఈ విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు హరీష్‌రావుపై వ్యక్తిగతపై చేసినవే తప్ప తెెలంగాణపై కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణలో భాగంగా ఆదివారం తాను విశాఖజిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. మావోయిస్టుల సంచారం అంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఆ విషయాలన్నీ పోలీస్‌శాఖ చూసుకుంటుందని, తన పర్యటన యథాతథంగా జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.