గుంతలో పడి యువకుడికి తీవ్ర గాయాలు
దారుణమైన రోడ్డుతో రోజుకో సంఘటన
— ఎంత జరిగినా పట్టించుకోని అధికారులు,
పాలకులు
టేకులపల్లి ,సెప్టెంబర్ 18( జనం సాక్షి) : ఇల్లందు కొత్తగూడెం ప్రధాన రహదారిలోని మండల కేంద్రం సమీపాన పెట్రోల్ బంకు వద్ద గుంతలో పడి మోటార్ సైకిల్ లిస్ట్ కి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం జరిగింది. ఖమ్మం కు చెందిన ఒక యువకుడు తన మోటార్ సైకిల్ పై కొత్తగూడెం వైపు నుండి ఖమ్మం వెళ్లడానికి ప్రయాణం చేస్తుండగా సాయంత్రం ఏడు గంటల సమయంలో పెట్రోల్ బంకు సమీపాన గుంతలో పడి తీవ్ర గాయాలు పాలై ఓ కాలు తొంటిలో విరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువకుడు తనది ఖమ్మం అని చెప్పగలిగాడు గాని తన పేరు కూడా చెప్పలేకపోయాడు. స్థానికులు వెంటనే 108కి సమాచారం ఇచ్చి ఇల్లందు ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. ఇటీవల గత మంగళవారం రోడ్ల దుస్థితిపై అడుగుకోగుంత అనే శీర్షిక జనం సాక్షి పత్రికలో ప్రచురితమైంది. ఆ వార్తపై స్థానిక ఇల్లందు ఎమ్మెల్యే స్పందించి నేషనల్ హైవే ఎస్సీ కి ఫోన్ చేసి గుంతలు పడిన రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. వారం రోజులలో మరమ్మత్తులు చేపడతామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పట్టించుకోకపోవడం మరీ దారుణం. ప్రజల ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని రోజుకో సంఘటనలు జరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం అధికారులు నిర్లక్ష్యమా పాలకులు నిర్లక్ష్యమా అనేది అర్థం కాక ప్రజల ఆవేదన చెందుతున్నారు. ప్రతిరోజు జరుగుతున్న రహదారి గుంతలలో పడి ప్రమాదాలు జరుగుతున్న వాటికి బాధ్యత ఎవరు వహించాలి అనేది పాలకులు అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా అధికారులు పాలకులు సత్వరమే స్పందించి దారుణంగా ఉన్న రోడ్డు గుంతలను మరమ్మత్తులు చేపట్టాలని ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు.