గ్రామాలే ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్లు
రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 2006 గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీల పాలకవర్గాల గడువు 2011 ఆగస్టుతో ముగియగా అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సర్పంచ్‌ల స్థానే ప్రభుత్వ అధికారులను పంచాయతీలకు స్పెషలాఫీసర్లుగా నియమించింది. ఉద్యోగుల కొరతతో క్షణం తీరిక లేకుండా ఉండే అధికారులు పంచాయతీల పాలనను గాలికొదిలేశారు. అజమాయిషీ లేకపోవడంతో పంచాయతీల ఉద్యోగులు, సిబ్బందికి జవాబుదారి తనం లేకుండా పోయింది. ఫలితంగా గ్రామ పాలన కుంటుపడింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు పాలకవర్గాలు లేనికారణంగా రెండేళ్లుగా నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామాలు అధ్వానంగా తయారయ్యాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేని తనం వెరిసి గ్రామీణులు పుట్టెడు కష్టాలు అనుభవించారు. కనీసం పారిశుధ్య నిర్వహణ, క్లోరినేషన్‌లాంటి చర్యలు కూడా చేపట్టలేని దుస్థితిలోకి గ్రామాలను నెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం. కోర్టు కేసులను బూచీగా చూపి ప్రభుత్వం ఆడిన కైలాసం ఆటలో ప్రజలు పాములకు చిక్కి అట్టడుగుకు చేరిపోయారు. ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు సర్కారు ముందుకు రావడంతో గ్రామాల్లో చాలా కాలం తర్వాత ఎన్ని’కల’ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రజాస్వామ్యానికి గ్రామ పంచాయతీలే పట్టుకొమ్మలు. స్థానిక పాలనకు నిలువెత్తు నిదర్శనం గ్రామ పంచాయతీ వ్యవస్థ. 1958లో పురుడు పోసుకున్న ఈ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అనేక ఆటుపోట్లు ఎదుర్కుంటోంది. ఎప్పటికప్పుడు జవసత్వాల కోసం స్థానిక ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపునకు యత్నించారు. కానీ అవి పూర్తిగా ఫలితాలు ఇవ్వలేదు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 1994లో రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల కమిషనర్‌ను నియమించారు. కానీ పంచాయతీలకు పూర్తిగా అధికారాల బదలాయింపు జరుగలేదు. ఎన్నికల నిర్వహణను ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కొర్రీలు పెడుతూ పరిస్థితి తమకు అనుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. ఫలితంగా గాంధీజి కలలు కన్న గ్రామ స్వరాజ్యం కానరాకుండా పోయింది. ఒకప్పుడు గ్రామంలో ప్రశాంత వాతావరణంలో జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఉద్రిక్తతలు చొరబడ్డాయి. రాజకీయ పార్టీలకతీతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నా పోటీ పడుతున్న అభ్యర్థులంతా రాజకీయ నేపథ్యం గలవారే. ఈ నేపథ్యంలో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అవుతాడు అనేది ఆయా పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. పంచాయతీ ఎన్నికలకు రాజకీయ రంగు అంటుకోవడం గ్రామ స్వరాజ్యానికి మాయని మచ్చలా పరిణమించింది. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో పంచాయతీల్లోనే పట్టు నిలుపుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పంచాయతీల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు ఇప్పటి విజయం దోహదం చేస్తుందని, వీటి ఫలితం వచ్చే ఏడాది మొదటి అర్ధభాగంలో జరిగిన సాధారణ ఎన్నికలపై ఉంటుందని అన్ని పార్టీలు లెక్కలు వేసుకున్నాయి. అందుకే పంచాయతీ ఎన్నికలకు అపవిత్రత చేకూర్చుతున్నాయి పార్టీలు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ధనమే రాజ్యమేలుతోంది. కొన్ని గ్రామాల్లో పెద్దలు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తూ వేలం పాటల ద్వారా పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకుంటున్నారు. గ్రామాభివృద్ధి ముసుగులో సర్పంచ్ పదవికి ఇంత, ఉప సర్పంచ్‌కు ఇంత, వార్డు సభ్యుడికి ఇంత రేట్ అని ఫిక్స్ చేసి అంగడి సరుకులా మార్చేశాయి. ఒకప్పుడు గ్రామ పంచాయతీ స్థాయిలో పదవులకు ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఎన్నికల్లో ప్రత్యర్థులే అయిన అందరూ ఒకే గ్రామ ప్రజలు. ఈ విషయాన్ని గుర్తెరిగి మసలుకునేవారు. ఎవరు గెలుపొందినా మిగతా వారు అభివృద్ధికి సహకరించేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో గెలవాలంటే లక్షలు ఖర్చు చేయాలి. గ్రామస్తులందరినీ మత్తులో, కానుకల్లో ముంచి తేల్చాలి. మర్యాదలో ఎక్కడ ఏ లోపం జరిగినా అంతే. అలా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తర్వాత ఎన్నికల్లో ఖర్చు చేసిన మొత్తం వడ్డీతో సహా రాబట్టుకుంటున్నారు. కొందరైతే ఐదేళ్లు దోచుకోవడానికి లైసెన్స్ వచ్చినంతగా సంబరపడి పోతున్నారు. గ్రామాభివృద్ధికి వచ్చే నిధులను గుటకాయ స్వాహా చేసి ఊరి పరువు తీస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేసే అవకాశమొస్తే దానిని స్వీయ ధనార్జనకు ఉపయోగించుకుంటున్నారు. పల్లెలే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు, ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్లు అనే విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు కొందరు. రాజకీయాల్లో మార్పులు రావాలంటే ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు. అది గ్రామ స్థాయి నుంచే మొదలు కావాలి. రాజకీయాలంటే సేవ అనే భావన ఉన్న నాయకులు గ్రామ స్థాయి నుంచే రావాలి. అలాంటప్పుడే అవినీతిలో కూరుకుపోయిన రాజకీయాలను కాస్త బాగు చేయవచ్చు. దోపిడీదారులు, దగాకోర్లు, దోషులతో మిలితమైన రాజకీయ వ్యవస్థకు కాస్తయిన చికిత్స చేయవచ్చు. అది గ్రామ స్థాయి నుంచి మొదలు కావాలి. అందుకు ప్రతి గ్రామీణుడు పాటు పడాలి. నాకేం వస్తుంది అనే ధోరణి వీడి.. మనం అనే భావన ప్రజల్లో బలపడాలి. అప్పుడు ప్రజాస్వామ్య పునర్నిర్మాణం సాధ్యమవుతుంది.