చట్టసభల్లో సీట్ల పెంపుపై ఎందుకీ మౌనం !

విభజన చట్టం మేరకు ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉన్నా ఎందుకనో కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అలాగే సీట్లను 2028 వరకు పెంచేది లేదని కూడా ఖరాఖండిగా చెప్పేసింది. అయితే విభజన చట్టం ప్రకారం అమలు చేయాల్సిన ఏ పనీ జరగడం లేదన్నది వేరే విషయం. హావిూల అమలులో గత ప్రభుత్వాలతో పోలిస్తే మోడీ మరింత మొండిగా వ్యవహరి స్తున్నారు. తనను కలవడానికి, చర్చించడానికి అవకాశం లేకుండా చేసుకుంటున్నారు. అలాగే ఎవరినీ సంప్రదించిన దాఖలాలు కూడా లేవు. అమిత్‌ షా, ఆయనా ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారో ప్రపంచానికి కూడా తెలియదు. ఇక దేశంలో ఏదైనా సమస్య పైనా చర్చించడానికి సిద్దంగా లేరు. అందుకే విభజన చట్టం మేరకు రావాల్సిన, ఇవ్వాల్సిన వాటిపై ఎవరిని అడగాలో తెలియదు. బిజెపి శ్రేణులు కూడా మోడీ భజనలో మునిగి తేలడంతో అసలు సమస్యలను చర్చించే అవకాశం లేదు. గతంలో వాజ్‌పేయ్‌, అద్వానీల సమయం లో ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగేది. మామూలు వారైనా సమస్యలను ఆ ఇద్దరు అగ్రజుల దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఆయా రాష్టాల్రు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు రాష్టాల్రకు సంబంధించి ఏ సమస్యను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్నది నిర్వివాదాంశం. అందుకే అసెంబ్లీ సీట్ల పెంపుపై ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. అసలు పార్లమెంటునే విశ్వాసంలోకి తీసుకుని ఏ అంశాన్ని కూడా చర్చించడం లేదు. బిల్లులు కూడా బుల్‌డోజ్‌ అవుతున్నాయి. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ఉన్న జనాభాకు అనుగుణంగా పార్లమెంట్‌ సీట్లు ఉన్నాయి. వాటిని ప్రస్తుత జనాభాకు అనుగుణంగా పెంచుకోవాల్సిందే. కనీసం వేయి సీట్లు ఉంటేనే ఇప్పుడున్న జనాభాకు తగిన ప్రాతినిధ్యం దక్కదు. 130కోట్లు ఉన్న జనాభాకు అనగుణంగా పార్లమెంట్‌ సీట్లను పెంచుకోవాలి. కానీ అటు పార్లమెంట్‌ కానీ..ఇటు అసెంబ్లీ సీట్లు కానీ పెంచడంపై చర్చ జరగడం లేదు. సీట్లు పెరిగితే తప్ప మరికొంతమంది దళితులు, ఆదివాసీలు, నిమ్నవర్గాలకు చట్టసభల్లో స్థానాలు పెరుగుతాయి. అలా చేస్తేనే వారి వాణి పార్లమెంటులో వినిపిస్తారు. కానీ అలా జరగడం లేదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక చరిత్ర సృష్టించే నిర్ణయాలు తీసుకుంది. అనేక కీలక బిల్లులకు ఆమోదం లభించింది. ఇకపోతే ప్రపంచమే ఆశ్చర్యపోయేలా..భారత ప్రజలు ఔరా అనిపంచుకునేలా ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుతో పాటు ఆర్టికల్‌ 370కి మంగళం పాడిరచింది. నిజంగా భారతదేశ చరిత్రలో ఇదో కీలక మలుపు. ఇంతకాలం మూసపద్దతుల్లో సాగుతున్న పాలనను భిన్నంగా ముందుకు తీసుకుని వెళ్లడమే లక్ష్యంగా మోడీ నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో మరో ప్రధాన నిర్ణయం కోసం ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒకటి పార్లమెంట్‌ సీట్ల సంఖ్యను పెంచడం…రెండోది మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లును ఆమోదించడం. ఈ రెండూ కూడా అత్యావ శ్యకమే.కానీ పార్లమెంట్‌ నడుస్తున్న వేళ ఇప్పుడు పెగాసస్‌ వ్యవహారంతో విపక్షాలు తమ సమయాన్ని వృధా చేస్తూ ప్రజల సమస్య లను గాలికి వదిలేశాయి. అలాగే ప్రధాని మరో నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్‌ ఖేల్‌ రత్నను మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌రత్నగా మార్చారు. అయితే దీనికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. కానీ శ్రమించాల్సిన అంశాలను పక్కన పెడుతున్నారు. మహిళా బిల్లును కూడా ఆమోదింపచేయడం ద్వారా వారి చిరకాల కోరికను మన్నిస్తారని అంతా భావించారు. పార్లమెంట్‌ సీట్లు పెరిగి, వారికి రిజర్వేషన్లు వస్తే సమన్యాయం జరగగలదు. కానీ అలా జరగడం లేదు. 370 ఆర్టికల్‌ను రద్ద చేయడం లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మోడీ ప్రభుత్వానికి ఈ రెండు నిర్ణయాలు ఏమంత పెద్దవి కాక పోవచ్చు. ఇంతకాలం
పార్లమెంటులో సంపూర్ణ మెజార్టీ ఉన్నా మహిళా బిల్లుకు మాత్రం మోక్షం దక్కడం లేదు. దీనిని గట్టెక్కిం చడంలో కనీసం ప్రస్తావన కూడా జరగడంలేదు. మోడీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మహిళాబిల్లు గట్టెక్కుతుందని అంతా ఆశించారు. ఈ దశలో బిజెపి మాత్రమే మహిళా బిల్లును తీసుకుని వస్తుందన్న భరోసా మహిళ్లో కూడా ఉండేది. మహిళా బిల్లును ఆమోదించక పోవడం, దాని గురించి ప్రస్తావించక పోవడం ఓ రకంగా రాజకీయ పార్టీల వైఫల్యంగానే చూడాలి. ఎన్నో ఆదర్శాలు వల్లించిన పార్టీలు, వాటి నేతలు ఈ విషయంలో ఘోర వైపల్యాన్ని ప్రదర్శించాయి. భారత రాజకీయాల్లో సామాన్యులకు భాగస్వామ్యం దక్కాలి. ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్లు అమలవుతున్నా దళితులు, గిరిజనులకు ఇంకా సామాజకమైన పూర్తిస్థాయి గుర్తింపు రాలేదు. అలాగే మహిళలు కీలక భూమిక పోషిస్తున్నా గత రెండు దశాబ్దాలుగా మహిళా బిల్లు మాత్రం గట్టెక్కలేకపోతోంది. పోటీ ప్రపంచంలో మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు రావాలి. క్షేత్రస్థాయిలో సర్పంచ్‌,మండల, జిల్లా పరిషత్‌లో రిజర్వేషన్లు దక్కుతున్నా అత్యున్నత చట్టసభల్లో వారికి కోటా దక్కడం లేదు. పార్లమెంట్‌ కొత్త భవనం నిర్మితం కాబోతున్న తరుణంలో పార్లమెంట్‌ సీట్లు పెంచడం ద్వారా దేశంలోని అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం దక్కేలా చేయాలి. వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపి వారిని మనతో సమానంగా ముందుకు తీసుకుని వెళ్లడంలో సమాజం విఫలమయ్యిందనడంలో సదేహం లేదు. దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షలపై చట్టసభలు మరింత చురుకుగా స్పందించడం లేదు. పాలనలో వారికి భాగస్వామ్యం కల్పించ కుండా వారిని అణగదొక్కే కుట్రల్లో అన్ని పార్టీలదీ పాత్ర ఉంది. అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఎందుకనో రాజకీయంగా ముందుకు సాకుండా అణగదొక్కుతున్నారు. దేశంలోని అట్టడుగు వర్గాలను కూడా విశ్వాసం లోకి తీసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాలన సాగాలి. చట్టసభల్లో రిజర్వేషన్లు ఎవరి దయాధర్మంగానో కాకుండా హుక్కుగా, సగౌరవంగా లభించాల్సి ఉంది. హక్కుల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోకుండా చూడాలి. ప్రజాస్వామ్యంలో కేవలం అధికారపక్షమే కాదు ప్రతిపక్షాలకూ, ప్రజలందరికీ పాత్ర ఉంటుంది. అందువల్ల పార్లమెంట్‌, అసెంబ్లీ సీట్లు పెంచడం. మహిళల రిజర్వేషన్లు ఆమోదించడం వంటి అత్యసవర చర్యలకు పాలకులు పూనుకోవాలి.