‘మేక్ ఇన్ ఇండియా’తోనే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరింది
` మన అద్భుతమైన సాంకేతికతతో పాకిస్తాన్ తోక ముడిచింది
` బెంగళూరులో మెట్రో మూడో ఫేజ్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
బెంగుళూరు(జనంసాక్షి):పాకిస్థాన్‌ను మట్టికరిపించిన ‘ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ‘మేక్ ఇన్ ఇండియా’, మన సాంకేతికత దాగి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సరికొత్త భారత్‌ను ప్రపంచం మొదటిసారి చూసిందన్నారు. రూ.15,610 కోట్ల వ్యయంతో బెంగళూరులో మెట్రో మూడో ఫేజ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. నవ భారతానికి చిహ్నంగా బెంగళూరు ఎదుగుతోందన్నారు. ‘’ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్‌ను చూసింది. మన బలగాలు పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని.. కొన్ని గంటల్లోనే ఆ దేశాన్ని మోకరిల్లేలా చేశాయి. ఈ విజయానికి మన టెక్నాలజీ, రక్షణా రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ శక్తి దోహదపడ్డాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. 2014కు ముందు కేవలం ఐదు నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు.. నేడు 24 నగరాలకు విస్తరించాయన్నారు. బెంగళూరు మెట్రో కోసం కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ ఖర్చు చేస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. బెంగళూరులో మెట్రో మూడో ఫేజ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఈమేరకు మాట్లాడారు. ‘’ఒప్పందం ప్రకారం మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం, రాష్ట్రం సమానంగా నిధులు సమకూర్చాల్సి ఉంది. అయినప్పటికీ.. రాష్ట్రం ఎక్కువ ఖర్చు చేస్తోంది’’ అని తెలిపారు. అభివృద్ధి విషయంలో మహారాష్ట్ర, గుజరాత్‌ల మాదిరే కర్ణాటకకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అంతకుముందు బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్‌గా అమృత్‌సర్-కాట్రా, నాగ్‌పుర్-పుణె వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జెండా ఊపారు. బెంగళూరు-బెళగావి వందేభారత్ రైలులో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా.. నగరంలోని ఆర్‌వీరోడ్డు- బొమ్మసంద్ర మధ్య ఎల్లో లైన్ (19.15 కిలోమీటర్లు) మార్గాన్ని ప్రారంభించారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో పర్యటించారు. బెంగళూరు – బెళగావి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్‌గా అమృత్‌సర్ – కాట్రా , నాగ్‌పుర్ – పుణె వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జెండా ఊపారు. బెంగళూరు-బెళగావి వందేభారత్ రైలులో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా.. నగరంలోని ఆర్‌వీరోడ్డు- బొమ్మసంద్ర మధ్య ఎల్లో లైన్( 19.15 కిలోమీటర్లు) మార్గాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభించడంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. తాము కష్టపడి రూపొందించిన అర్బన్ మొబిలిటీ ప్రాజెక్ట్‌కు భాజపా క్రెడిట్ తీసుకుంటోందని ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు ఆలస్యమయ్యిందని దుయ్యబట్టారు. ఇప్పటిదాకా ఓట్ల చోరీ చేసి అధికారంలోకి వచ్చిన భాజపా.. ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తోందని మండిపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అప్పట్లో భారీగా ఖర్చు చేసి ప్రారంభించిన ఈ మెట్రో ప్రాజెక్టుకు భాజపా అధికారంలోకి వచ్చాక నిధుల కేటాయింపు తగ్గిందని ఆరోపించారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అధిక భారం పడడంతో అప్పులు కూడా చేయాల్సివచ్చిందన్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు చెక్ పెట్టాం: ఆర్మీచీఫ్ ఉపేంద్ర ద్వివేది
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారతీయ వాయుసేన పాకిస్థాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని నేలకూల్చిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆపరేషన్ సిందూర్‌పై ఇటీవల ఐఐటీ మద్రాస్‌లో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైన్యం దాయాది దేశంతో చెస్ ఆడిరదని అన్నారు. శత్రువు తదుపరి కదలికలు ఏమిటో కూడా ఆ సమయంలో తమకు తెలియదని.. ఈ పరిస్థితిని గ్రేజోన్ అంటారని అన్నారు. అయినప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ.. ఆ దేశానికి చెక్ పెట్టామని పేర్కొన్నారు.ఈ ఆపరేషన్‌ను ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ద్వివేది తెలిపారు. మన పౌరులను బలి తీసుకున్న ఉగ్రవాదులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరినప్పుడు.. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడిరచారు. దీంతో తాము ఉగ్ర స్థావరాలను సమర్థవంతంగా ధ్వంసం చేశామన్నారు. ఆపరేషన్ అనంతరం పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ మునీర్‌ను ఆ దేశ ‘ఫీల్డ్ మార్షల్’గా నియమించడాన్ని ద్వివేది ఎద్దేవా చేశారు. వారు యుద్ధంలో గెలవకపోయినా ఆర్మీ అధికారికి అత్యున్నత పదవి ఇవ్వగానే అక్కడి ప్రజలు తాము గెలిచామనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. కానీ అది విజయమా లేదా అపజయమా అనేది వారి మనస్సాక్షికే తెలుసన్నారు. మూడు నెలల క్రితం జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో పాక్ విమానాలను కూల్చిన విషయాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ శనివారం మొదటిసారి బహిర్గతం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌లో సాధించిన విజయాలు వివరించారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఏవిధంగా ధ్వంసం చేసిందీ తెలిపారు.