భారత్‌ అభివృద్ధిపై ట్రంప్‌ అక్కసు

` అసూయతో రగిలిపోతున్నారు
` రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
న్యూఢల్లీి(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సెటైర్లు వేశారు. భారత్‌ ఎదుగుదలను చూసి ట్రంప్‌ అసూయతో రగిలిపోతున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.అందుకే టారిఫ్‌ల పేరుతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.భారత్‌ ‘సూపర్‌ పవర్‌’కానుంది. అన్ని రంగాల్లో విశ్వవిజేతగా నిలుస్తోంది. అలాంటి భారత్‌ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. భారత్‌ అభివృద్ధిపై జరుగుతున్న చర్చను చూసి కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ ఎదుగుదల వాళ్లకు ఇష్టం లేదు.అందుకే ప్రపంచ దేశాల్లో మేడిన్‌ ఇండియా ఉత్పత్తుల కొనుగోళ్లు జరగకుండా కుట్ర చేస్తున్నారు. మేడిన్‌ ఇండియా ఉత్పత్తులు చాలా ఖరీదైనవనే ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం వల్ల కొనుగోళ్లు ఆపొచ్చని అనుకుంటున్నారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేను మీకు మాటిస్తున్నా.. ప్రపంచంలోని ఏ శక్తి భారత్‌ సూపర్‌ పవర్‌ అవ్వకుండా ఆపలేదని స్పష్టం చేశారు.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధానికి రష్యాకు భారత్‌ పరోక్షంగా సహకరిస్తోందని ట్రంప్‌ వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. భారత్‌.. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌ వెనక్కి తగ్గాలని హెచ్చరించారు. కాదంటే సుంకాల పెంపు ఉంటుందన్న ట్రంప్‌ పనిలోపనిగా.. భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్‌ విధించారు. అదనంగా పెనాల్టీ విధించారు.అంతేకాదు,రష్యాతో తన ఒప్పందాలను భారత్‌ నిలిపివేయాలని బెదిరించారు. ఇరు దేశాల మధ్య వ్యాపార,వాణిజ్య ఒప్పందాలు ఇలాగే కొనసాగితే మరింత సుంకాల పెంపు ఉంటుందని అన్నారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని అన్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ చర్యలను ఉద్దేశిస్తూ రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. ట్రంప్‌ చర్యలకు ధీటుగా బదులిచ్చారు.