ప్రజల ఆరోగ్యానికి కేంద్రం పెద్దపీట

` రేవంత్‌రెడ్డి ప్రభుత్వమైనా ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణలో ప్రవేశపెట్టాలి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు. ఉప్పల్‌లో ‘భారతీయ జనౌషధ పరియోజన’ పథకం ద్వారా ఉప్పల్‌ ఇండస్ట్రియల్‌ ప్రాంతంలో లోర్వెన్‌ ఫార్మా అండ్‌ సర్జికల్స్‌ సంస్థ ఏర్పాటు చేసిన తెలంగాణ మార్కెటింగ్‌ కమ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వేర్‌ హౌస్‌ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో కలిసి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అయినా ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణలో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని జనౌషధ కేంద్రాలకు మెడికల్‌ డిపోగా ఉప్పల్‌లో ప్రధాన మంత్రి భారతీయ జనౌషధ పరియోజన తెలంగాణ మార్కెటింగ్‌ కమ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వేర్‌ హౌస్‌ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.మోదీ ప్రభుత్వం 70సంవత్సరాలు నిండిన వృద్ధులకు.. ఆస్తితో, పెన్షన్‌తో సంబంధం లేకుండా రూ. ఐదు లక్షల వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ నగరంలోనైనా కోరుకున్న హాస్పిటల్‌లో వైద్యం చేయించుకునే విధంగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రవేశ పెట్టిందని కిషన్‌రెడ్డి చెప్పారు. మార్కెట్‌లో ఉన్న మెడిసిన్‌ ధరలతో పోల్చితే.. జనౌషధ కేంద్రాలలో 50 శాతం నుంచి 90 శాతం వరకు తక్కువ ధర ఉంటుందన్నారు.