పిల్లలకూ ఫుల్ టికెట్‌.. 5 ఏళ్లు లేకున్నా హాఫ్‌ టికెట్‌

హైదరాబాద్‌ (జనంసాక్షి) : రాఖీ పండుగ పూట పేద, మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. ఆర్టీసీ చార్జీలతో విలవిల్లాడిపోతున్నారు. తమ గమ్యస్థానాలకు వెళ్లాలనే తప్పని పరిస్థితుల్లో నిట్టూరుస్తూనే బస్సుల్లో టికెట్లు తీసుకుంటున్నారు. మహాలక్ష్మీ పథకం కింద ఫ్రీగా వెళ్లొచ్చనే ఆలోచనతో బస్టాండ్లు వెళ్తున్నవారికి ఎక్స్‌ప్రెస్‌ బస్సులు కనిపించకపోవడం, గంటల తరబడి వేచిచూసే పరిస్థితి ఉండటంతో గత్యంతరం లేక ఏ డీలక్సో, రాజధానో, ఎలక్రిక్‌ బస్సులో ఎక్కేస్తున్నారు. ఇక్కడే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ బస్సులంటూ స్టిక్కర్లు అతికించిన ఆర్టీసీ అధికారులు… వాటిలో వర్తించే ఇతర నిబంధనలేవీ పెట్టలేదు. తీరా బస్సు ఎక్కినవారికి టికెట్ల ధరలు చూసి గుండెలు గుభేల్‌మంటున్నాయి. 5 నుంచి 12 ఏండ్లలోపు పిల్లలకు కూడా ఫుట్‌ టికెట్‌ తీసుకోవాలని, ఒకవేళ హాఫ్‌ టికెట్‌ తీసుకుంటే సపరేట్‌ సీటు ఇవ్వడం కుదరదంటూ చెబుతున్నారు. 5 ఏండ్లలోపు చిన్నారులకూ హాఫ్‌ టికెట్‌ తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అధికారులతో మాట్లాడుకోండి అంటూనే బస్సు నిండగానే పాయింటు మీద నుంచి స్టార్ట్‌ చేస్తున్నారు. అక్కడే టికెట్లు ఇవ్వని డ్రైవర్లు, కండక్టర్లు 3 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత బస్సు ఆపి ప్రయాణికుల నుంచి టికెట్లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై దిగలేక, వారు చెప్పిన ధరలు చెల్లించక తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు అదనపు డబ్బులు పెడుతున్నారు. నిజానికి 5 ఏండ్లలోపు పిల్లలకు ఏ బస్సులోనైనా టికెట్‌ ఉండదు. 12 ఏండ్ల వరకు హాఫ్‌ టికెట్‌ వర్తిస్తుంది. కానీ స్పెషల్‌ స్టిక్కర్లున్న బస్సుల్లో ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ టికెట్లు వసూలు చేస్తుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలతో సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న తల్లులకు ఆర్టీసీ తాజా నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హాఫ్‌ టికెట్‌ తీసుకున్నవారికీ సీటు ఇవ్వబోమని డ్రైవర్లు (కండక్టర్లు) తెగేసి చెప్పడంతో ఇద్దరు పిల్లలున్నవారు వారిని వందలాది కిలోమీటర్లు పైన కూర్చోబెట్టుకుని ప్రయాణించడం వ్యయప్రయాసగా మారుతోంది. ఇదేనా ప్రజాపాలనా అంటూ ప్రయాణికులు తిట్లపురాణం అందుకోవడం బస్టాండుల్లో, బస్సుల్లో పరిపాటిగా మారింది.