తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతాం

` గత పాలకుల అవినీతి, అసమర్థత వల్లే కాళేశ్వరం కూలిపోయిందని కమిషన్‌ స్పష్టం చేసింది
` ప్రాజెక్టు నివేదికపై ఎలాంటి రాజకీయాలు లేవు
` 3 బ్యారేజీల్లో నీటిని నిల్వ ఉంచొద్దని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టంగా చెప్పింది
` ములుగు జిల్లాలో పర్యటనలో మంత్రి ఉత్తమ్‌
` దేవాదుల పంపుహౌస్‌ పనులపై సమీక్ష
ఏటూరునాగారం(జనంసాక్షి): రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీరుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా దేవాదుల పంపుహౌస్‌ పరిశీలించి..పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి దేవాదుల అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని చెప్పారు. దీని ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ కోసం రూ.67 కోట్లు అవసరమవుతుందని చెప్పారు. పెండిరగ్‌ బిల్లులు కూడా త్వరగా మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని ముంపు ప్రాంతాలకు పరిహారం ఇవ్వడానికి సిద్ధమన్నారు. భూసేకరణపై జిల్లాల కలెక్టర్లు త్వరగా చర్యలు చేపట్టాలని సూచించారు. ‘’కాళేశ్వరం కమిషన్‌ నివేదిక చూసి నిర్ఘాంత పోయాం. గత పాలకుల అవినీతి, అసమర్థత వల్లే కూలిపోయిందని కమిషన్‌ చెప్పింది. కాళేశ్వరం డిజైన్‌ చేసింది వారే.. కూలిపోయింది వారి హయాంలోనే. కాళేశ్వరం నివేదికపై ఎలాంటి రాజకీయాలు లేవు. నీటిని 3 బ్యారేజీల్లో నిల్వ ఉంచొద్దని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టంగా చెప్పింది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతాం’’అని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు.