పోస్టల్‌ సేవల్లో సర్వర్‌ ప్రాబ్లమ్స్‌

మొరాయిస్తున్న ఏపీటీ 2.0 యాప్‌
దేశవ్యాప్తంగా పదేపదే స్తంభిస్తున్న కార్యకలాపాలు
డెలివరీ, ఔట్‌గోయింగ్‌లకు నిత్యం ఇబ్బందులే..
ప్రైవేటు కొరియర్లవైపు మొగ్గుచూపుతున్న వినియోగదారులు
నత్తనడకన సాంకేతిక సమస్యల పరిష్కారం
హైదరాబాద్‌, ఆగస్ట్‌ 10 (జనంసాక్షి) : తపాలా సేవలను సాంకేతికంగా విస్తరించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అడ్వాన్స్డ్‌ పోస్టల్‌ టెక్నాలజీ (ఏపీటీ 2.0) మొరాయిస్తోంది. డిజిటల్‌ సేవలను ఇంటింటికీ చేరుద్దామని కేంద్ర ప్రభుత్వం సంకల్పించినా సాంకేతిక సమస్యల వల్ల లక్ష్యం నీరుగారుతోంది. దీంతో ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం సాగే కార్యకలాపాలకూ ఇది ఆటంకంగా మారడంతో కొందరు ప్రైవేటు సేవలపైపే మొగ్గుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ ప్రభావం కనిపిస్తుండగా.. గ్రామీణస్థాయి పోస్టాఫీసుల్లోనూ సర్వర్లు డౌన్కె డెలివరీలు సైతం నిలిచిపోతున్నాయి. సేవలన్నీ ఆన్‌ల్కెన్‌మయం చేసినప్పటికీ ఈ పోస్టల్‌ సిస్టం తరచూ ఇబ్బందులు పెడుతోందని పోస్టల్‌ ఉద్యోగులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే ప్రవేశపెట్టిన ఏపీటీ 2.0 సిస్టమ్‌లో సర్వర్‌ వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా 1.5 లక్షల పోస్టాఫీసుల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఈ సంక్షోభం వల్ల సామాన్య ప్రజలు, వ్యాపార సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆగస్ట్‌ మొదటివారం నుంచీ స్పీడ్‌ పోస్ట్‌, రిజిస్టర్డ్‌ పోస్ట్‌, పార్శిల్‌ బుకింగ్‌, కన్స్కెన్‌మెంట్‌ ట్రాకింగ్‌, ఎలక్ట్రానిక్‌ మనీ ఆర్డర్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. రక్షాబంధన్‌ బహుమతులు, చట్టపరమైన పత్రాలు, ఇన్‌వాయిస్‌లు వంటి సమయానుగుణ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్‌ (ఫలక్‌నుమా, జీపీఓ అబిడ్స్‌), చెన్న్కె సెంట్రల్‌,తాంబరం, ఢల్లీ (35పైగా కార్యాలయాలు), మిజోరాం యూనివర్శిటీ, బారూయిపూర్‌, జాదవ్‌పూర్‌ యూనివర్శిటీలో ప్రధాన ఆటంకాలు నమోదయ్యాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ పోస్టల్‌ ఆర్గన్కెజేషన్‌ (ఎఫ్‌ఎన్‌పీవో) వెల్లడిరచింది. దీనివల్ల న్యాయ సంస్థలు, ఈ-కామర్స్‌ వ్యాపారాలు ఒప్పందాలు, నశ్వరమైన వస్తువులు చేరకపోవడంతో ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయని, ప్రజలు ప్రైవేట్‌ కొరియర్‌ సేవల వైపు మళ్లుతున్నారని పేర్కొంది.

కొత్త వ్యవస్థలో లోపాలు
ఏపీటీ 2.0లో సాంకేతిక వైఫల్యాలు, అంతర్గత డాక్యుమెంట్లు కొత్త వ్యవస్థలోని వ్యవస్థాగత లోపాలను వెల్లడిస్తున్నాయి. క్యూఆర్‌ చెల్లింపులు, యూపీఐ ఇంటిగ్రేషన్‌లు, పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ ప్రీమియం సేకరణలు సాధారణ సమయంలో ప్రతిబింబించడం లేదు. ఆదాయ ట్రాకింగ్‌లోనూ గందరగోళం కనబడుతోంది. సబ్‌స్టిట్యూట్‌ సిబ్బంది కోసం లీవ్‌ అప్లికేషన్‌లు ప్రాసెస్‌ చేయలేకపోవడం, బ్యాగ్‌, లేబుల్‌ సిస్టమ్‌ లోపాల వల్ల పార్శిల్‌ డిస్పాచ్‌ లోపాలు, సంస్థాగత డెలివరీలను అడ్డుకునే తప్పనిసరి మొబ్కెల్‌ నంబర్‌ ఫీల్డ్‌లు కార్యకలాపాల లోపాలుగా మారాయి. అయితే ఈ సమస్యలను పరిష్కరించడానికి రాత్రి 11 గంటల వరకు సిబ్బంది పనిచేస్తుండగా.. అపరిష్కృత బగ్‌ల వల్ల తీవ్ర ఒత్తిడి పడుతోంది. వారిలో శిక్షణా లోపాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

వినియోగదారుల్లో ఆగ్రహం
క్యాష్‌ డిపాజిట్లు, లెటర్ల డెలివరీలు, ఔట్‌గోయింగ్‌లు, ఆర్‌డీలు ఇత్యాది కార్యకలాపాలన్నీ గ్రామీణస్థాయి వరకు జరుగుతున్నాయి. వీటన్నింటినీ ఆన్‌ల్కెన్‌ ద్వారానే క్లియర్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకేరోజులో గంటల తరబడి కొత్త యాప్‌ మొరాయిస్తుందని, సర్వర్‌ డౌన్‌ కావడం వల్ల సమయం అంతావృథా అవుతోందని పలువురు పోస్ట్‌మెన్లు చెబుతున్నారు. సమస్యను వారి జోన్‌వారీ వాట్సప్‌ గ్రూపుల్లో షేర్‌ చేయడం, వాటిని ఏదొక సమయంలో పరిష్కరించడం చేస్తున్నప్పటికీ సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎన్‌పీవో 40కిపైగా కీలక బగ్‌ల జాబితాను అందించినప్పటికీ అవి పరిష్కారం నోచుకోలేదు. దీంతో తపాలా కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్‌ వంటి నగరాలతో పాటు గ్రామీణ స్థాయి వరకూ ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది.