చెక్కుల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి

– భూరికార్డుల ప్రక్షాళన 98శాతం పూర్తి
– దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు పథకం
– రైతు సంతోషం కోసం కేసీఆర్‌ కృషి
– చెక్కుల పంపిణీని పండుగలా జరుపుకోవాలి
– రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, మే8(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన 98.2శాతం పూర్తయిందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని సత్తుపల్లిలో జరిగిన రైతు సమన్వయ సమితి సవిూక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ… రైతు సంతోషం కోసమే ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి విధానాన్ని ప్రకటించిందన్నారు. అలాగే అత్యంత భద్రత, నాణ్యతా విలువలను పాటించి పాస్‌ పుస్తకాల ముద్రణ చేయించామన్నారు. అంతేగాక వ్యవసాయానికి ఉచితంగా 24గంటలు విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేలు అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తద్వారా ఒక్కొక్క సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 58లక్షల మంది రైతులకు గాను రూ.12 వేల కోట్లను వెచ్చించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే జిల్లా రైతాంగం కోసం ప్రతి సీజన్‌కు రూ. 267.62 కోట్ల నిధులను వెచ్చించడం జరుగుతుందన్నారు. తద్వారా రూ.2.78 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరబోతుందని పేర్కొన్నారు. వారంరోజుల పాటు జరిగే ఈ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండల, గ్రామ సమన్వయ సమితి సభ్యులు ముందంజలో ఉండాలన్నారు. రైతులకు, అధికారులకు వారధులుగా ఉంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. షెడ్యూల్‌ వారీగా చెక్కులను అందజేస్తామన్నారు. రైతులు ఎలాంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు. 300 మంది రైతులకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకేసారి చెక్కు, పాస్‌ పుస్తకాలను ఇస్తామన్నారు. 17వ తేదీ వరకు చెక్కుల పంపిణీ పూర్తయిన తర్వాత ఒకవేళ పాస్‌ పుస్తకాల్లో తప్పులు, ఒప్పులు, ఏమైనా అవతవకలు ఉన్నా, ఇంకెవరికైనా పాస్‌పుస్తకాలు రావాలనుకున్నా కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అటవీ ప్రాంతంలో గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టా ఇచ్చామని, వారిని పార్ట్‌-ఏలో చేర్పించి 93, 670 మందికి చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఒక ఎకరానికి వానాకాలం, యాసంగి కలిపి రూ.8వేల ఇస్తామన్నారు. భూమిలో రాళ్లు, రప్పలు ఉన్నా చెక్కులు పంపిణీ చేయాల్సిందేనని కేసీఆర్‌ ఆదేశించారన్నారు. అభివృద్ధిని ఓర్వలేక ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మొద్దన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక 24 గంటల కరెంటు ఇస్తుందన్నారు. రుణమాఫీ చేసిందన్నారు. ఇప్పుడు రైతుబందు పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని అందజేస్తోందన్నారు. రైతాంగ అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్య ఇస్తోందన్నారు. రైతులను సంఘటిత పర్చి ఐక్యం చేయడానికి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామన్నారు