జంతర్‌మంతర్‌ వద్ద మర్మోగుతున్న తెలం’గానం’

– రెండో రోజూ నిరాహార దీక్షలు

– పలు రాజకీయ పార్టీల మద్దతు

– తెలంగాణకు మద్దతు ప్రకటించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) : దేశ రాజధానిలో తెలం’గానం’ మార్మోగింది. 2009 డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అమలు చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం జంతర్‌మంతర్‌ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సోనియాగాంధీ నివాసం వైపు చొచ్చుకేళ్లుందుకు ప్రయత్నించిన విద్యార్థులపై అక్కడి పోలీసులు లాఠీచార్జి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సోమవారం దీక్షపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. రెండో రోజు కూడా విద్యార్థులు అదే పట్టుదలతో ఆందోళన కొనసాగించారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థులు దీక్షకు పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధర్మబద్ధమైన డిమాండేనని వారు పేర్కొన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ బాధ్యులు కూడా విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.