భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్‌లో గుసగుసలు
విదేశీ పర్యటన ముగించుకుని వచ్చీ రాగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హడావుడిగా హైడ్రాపై ప్రెస్‌మీట్ పెట్టారు. హైదారాబాద్‌లో చెరువుల ఆక్రమణలు అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు గంటన్నర సేపు మీడియాతో ముచ్చటించారు. ఇంతకు వరకు బాగానే ఉంది. కానీ భట్టి మాటలే అనేక సందేహాలకు తావిచ్చాయి. చెరువులు, మూసీ సుందరీకరణ తదితర అంశాలన్నీ ఇటు పురపాలక, అటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినవి. వీటిపై సంబంధిత శాఖల మంత్రులు మాట్లాడితే దానికో అర్థం ఉంటుంది. కానీ, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఇక్కడ అంతా తానై మీడియా సమావేశం నిర్వహించడంపై కాంగ్రెస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విదేశీ పర్యటనలో తాను సందర్శించిన థేమ్స్ నది గురించి ప్రస్తావిస్తూనే.. డిప్యూటీ సీఎం హెచ్‌ఎంఏడీ పరిధిలోని చెరువులన్నింటినీ మళ్లీ సర్వే చేస్తామని బాంబు పేల్చారు.అంతేకాదు చెరువుల ఆక్రమణలపైనా ఏకరవు పెట్టారు. ఆర్థిక శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం.. ఇంత హడావుడి చేయడంపై అధికారవర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దీనికీ ఉప ముఖ్యమంత్రి ఓ సమాధానం చెప్పారు. టీజీ ర్యాక్ (తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్) తన పరిధిలోనేదే అంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. నిజమే… ప్రణాళిక విభాగంలో అదీ ఒక భాగమే. కానీ చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ, ఆక్రమణలు అనేది దాని బాధ్యత కాదు కదా!! కేవలం సాంకేతిక సహకారం మాత్రమే కదా ర్యాక్ ఇచ్చేది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు… డిప్యూటీ సీఎం లాజిక్ ప్రకారం టీజీ ర్యాక్ వంటి చిటికెన వేలు బంధంతో అది సాంకేతిక సహకారం అందించే ప్రతి శాఖపైనా డిప్యూటీ సీఎం సమీక్షలు చేపట్టే అవకాశం ఉంటుంది.. నిర్ణయాలు ప్రకటించే అధికారం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.