2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తను. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డికి ఎన్నికల ఏజెంట్‌గా పనిచేసిన. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన పంట రుణాలు సగం మంది రైతులకే మాఫీ అయ్యాయి. అందుకు నేనే ఉదాహరణ. నాకు బ్యాంకులో రూ.2 లక్షల లోపు పంట రుణం ఉంది. అయినా మాఫీ కాలేదు. నా లాంటి వాడికే రుణం మాఫీ కాకపోతే.. ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏమిటి?’ అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిలెకు చెందిన కల్లూరి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమక్షంలో జరిగిన రుణమాఫీ సమావేశంలో ఆయన పాల్గొని సొంత పార్టీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఇద్దరు రుణం తీసుకుంటే రుణమాఫీ వర్తించదని ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రకటించకుండా రైతులను మోసం చేశారని ఆరోపించారు.రేవంత్‌రెడ్డి సర్కారు తీరు ‘ఓడ ఎక్కాక ఓడ మల్లయ్య.. ఓడ దిగాక బోడ మల్లయ్య’ చందంగా ఉందని విమర్శించారు. తాను నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం తనతోపాటు ఎంతోమంది రైతులకు అన్యాయం చేసిందని, రుణమాఫీని ఎగ్గొట్టడానికే జాప్యం చేస్తున్నదని మంత్రి ఎదుటే కుండబద్దలు కొట్టారు. వెంటనే రుణమాఫీ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మల్లారెడ్డి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో మంగళవారం వైరల్ అయ్యింది.