370 రద్దుపై రెఫరెండం

కాశ్మీర్‌లో ఇండియా కూటమి ఘనవిజయం
నేషనల్‌ కాన్ఫరెన్స్‌` కాంగ్రెస్‌ కూటమి విజయం
ఎన్‌సీ 42 చోట్ల, కాంగ్రెస్‌ 6 స్థానాల్లో విజయ దుందుభి
29 సీట్లకే పరిమితమైన బీజేపీ
ఇతరులకు, స్వంత్రులకు 10 స్థానాలు
శ్రీనగర్‌(జనంసాక్షి):ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌` కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్‌ ఫిగర్‌ కన్నా రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఎన్‌సీ 42 చోట్ల, కాంగ్రెస్‌ 6 స్థానాల్లో విజయ దుందుభి మోగించాయి. బీజేపీ 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. అందులో ఒకరు ఆప్‌ అభ్యర్థి ఉన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్పు వంటి నిర్ణయాల నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఎన్‌సీ`కాంగ్రెస్‌ కూటమివైపే మొగ్గు చూపారు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధనకు కృషి చేస్తామన్న వాగ్దానాన్ని నమ్మి` ఆ రెండు పార్టీలకే పట్టం కట్టారు. పీడీపీ కూడా ఇలాంటి హావిూలే ఇచ్చినా` గతంలో బీజేపీతో జట్టు కట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని నమ్మలేదు.చరిత్రలో తొలిసారి జమ్ముకశ్మీర్‌ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందింది ఆప్‌. దోడా నియోజకవర్గం నుంచి ఆప్‌ టికెట్‌పై పోటీ చేసిన మెహ్రాజ్‌ మాలిక్‌` బీజేపీ అభ్యర్థిపై గజయ్‌ సింగ్‌ రాణాపై 4,538 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తానికి జమ్ముకశ్మీర్‌లో హంగ్‌ ఏర్పడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు వేయగా, అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలున్నాయి. 2014లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 87 సీట్లలో భాజపా 25 స్థానాలు సాధించింది. పీడీపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో సీట్లు 90కి పెరిగాయి. అయితే గవర్నర్‌ కోటాలో ఐదు నామినేటడ్‌ సీట్లు ఉన్నాయి. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ 48గా ఉంది. 2019లో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌)గా కేంద్రం విభజించింది. ఈ నేపథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ రాణించింది. అక్కడి మరో ప్రాంతీయ పార్టీ పీడీపీ మూడు స్థానాలు దక్కించుకుంది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్‌.. ఇక్కడ తొలిసారి పోటీ పడి, ఖాతా తెరిచింది. స్వతంత్రులు ఏడు స్థానాలు దక్కించుకున్నారు.ఈ విజయంతో సంతోషంలో ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా నే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతారని తెలిపారు. ‘పదేళ్ల తర్వాత ప్రజలు తమ తీర్పును తెలియజేశారు. ఆగస్టు 5 నాటి నిర్ణయాన్ని (2019లో ఆర్టికల్‌ 370 రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ) తాము అంగీకరించడం లేదని స్పష్టంగా చెప్పారు. ఒమర్‌ అబ్దుల్లానే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మా కూటమి నిరంతరం పోరాడుతుంది’’ అని ఫరూక్‌ అబ్దుల్లా వెల్లడిరచారు.