జాతీయ రహదారులపై మెరుగైన సౌకర్యాల కోసం కొత్త పాలసీ

` ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ
దిల్లీ(జనంసాక్షి): జాతీయ రహదారుల వెంబడి మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. హైవేలపై ప్రయాణించే వారికి స్వచ్ఛమైన టాయిలెట్లు, బేబీ కేర్‌ రూమ్స్‌ వంటి సౌకర్యాలు లభించనున్నాయి.దీనికోసం ఉద్దేశించిన హంసఫర్‌ పాలసీని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ప్రారంభించారు. ఈ పాలసీ ప్రకారం పెట్రోల్‌ పంపుల వద్ద టాయిలెట్లతో పాటు వీల్‌ఛైర్లు, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు, పార్కింగ్‌, డార్మిటరీ, ఫుడ్‌ కోర్టు, ఏటీఎం, వాహనాల రిపేరింగ్‌ షాప్‌, ఫార్మసీ వంటివి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయంటూ ఆ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ విధానం వల్ల జాతీయ రహదారులపై ప్రయాణికులకు మెరుగైన, ఆనందదాయకమైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు కొత్తగా ఉద్యోగాలు సృష్టి జరుగుతుందని చెప్పారు. తద్వారా ఆయా సౌకర్యాలు అందించే వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులకు రానున్న రోజుల్లో మెరుగైన సేవలకు హంసఫర్‌ అనేది పర్యాయపదంగా మారనుందని చెప్పారు. ప్రయాణికులతో పాటు డ్రైవర్లకూ జాతీయ రహదారుల వెంబడి సేవలు లభిస్తాయన్నారు.

తాజావార్తలు