మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

` కసరత్తులు ముమ్మరం చేసిన ప్రభుత్వం
` మంత్రుల ఆద్వర్యంలో కీలక చర్చలు
` డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశాలు
హైదరాబాద్‌(జనంసాక్షి):మహిళా సంఘాలను ఆర్దికంగా బలోపేతం చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో..మహిళా సంఘాలకు ఉపాధి కల్పిస్తూ వారి ద్వారా కొనుగోలు చేసిన బస్సులను హైర్‌ చేసుకోవాలని ఆర్డీసీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని నిర్ణయించింది. మంగళవారం నాడు సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, పంచాయతీ రాజ్‌ గ్రావిూణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆద్వర్యంలో రవాణా శాఖ, పీఆర్‌ ఆర్డీ ఉన్నాధికారుల సమావేశం జరిగింది. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు విధి విధానాలపై చర్చలు జరిపారు. రవాణా శాఖ స్పెషల్‌ సెక్రటరి వికాస్‌ రాజ్‌, కవిూషనర్‌ ఇలంబర్తీ, పీఆర్‌ ఆర్‌ డీ సెక్రటరి లోకేష్‌ కుమార్‌, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌, టీజీ ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. మొదటి విడతలో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని నిర్ణయించారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌ నగర్‌, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సొంత జిల్లా కరీం నగర్‌ లను ఎంపిక చేసారు. మొదటి విడతలో 100 నుంచి 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మహిళా సంఘాలు కొనుగోలు చేసే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాద్యతల కోసం ప్రత్యేక వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయం,  నిర్వహణ ఖర్చు తదితర అంశాలన్నింటితో కూడిన సమగ్ర నివేదికను సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.