అసెంబ్లీ ఫలితాల్లో ఆప్‌కు ఆశాభంగం

` రెండు రాష్టాల్ల్రోనూ భంగపాటు
` ఎన్నికలను లైట్‌గా తీసుకోవద్దు
` ఫలితాల వేళ కేజ్రీవాల్‌ వ్యాఖ్య
న్యూఢల్లీి(జనంసాక్షి): హరియాణా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. హరియాణాలో బీజేపీ దూసుకెళ్తుండగా.. జమ్మూ కశ్మీర్‌లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది. అయితే రెండు రాష్టాల్ల్రో ఒంటరిగా బరిలో దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్‌ ఇచ్చాయి. ఇప్పటికే ఢల్లీి, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌ తమ పరిధిని విస్తరించుకోవాలని చూసిన ఆప్‌కు ఆశాభంగం తప్పలేదు. జమ్మూ, హరియాణా రెండు రాష్టాల్ల్రో ఒక్క స్థానంలోనూ ఆప్‌ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇప్పటికే ఢల్లీిలో బీజేపీ నుంచి సవాల్‌ ఎదుర్కుంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు షాక్‌ ఇచ్చాయని అనుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలో ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో హరియాణా, జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు ఆప్‌నకు నిరాశ కలిగించడం సాధారణమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హరియాణాలో తొలుత కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు జరిగినా సీట్ల పంపకం తేడాతో కాంగ్రెస్‌తో ఆప్‌ విబేధించింది. రెండు రాష్టాల్లో అన్ని స్థానాల్లో ఆప్‌ తమ అభ్యర్థులను బరిలోకి దించి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. తద్వారా ఓట్ల చీలికతో పరోక్షంగా ఎన్డీఏ కూటమికే ఆప్‌ పోటీ మేలు చేసిందన్న విమర్శలు ఎదుర్కుంటోంది.
ఎన్నికలను లైట్‌గా తీసుకోవద్దు : కేజ్రీవాల్‌
దిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒంటరిగా బరిలోకి దిగి చతికిలబడిరది. ఈ క్రమంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదని వ్యాఖ్యానించారు.’’ఎన్నికలు సవిూపిస్తున్నాయి. వాటిని మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎప్పుడూ అతివిశ్వాసంతో ఉండకూడదనేది ఈ ఎన్నికలు నేర్పిన పాఠం. ప్రతి ఎన్నిక, ప్రతి స్థానం కఠినమైనదే. విజయం కోసం కష్టపడిపనిచేయాలి. అంతర్గత పోరు ఉండకూడదు’’ అని పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు చేశారు. ఆయన స్వంత రాష్ట్రం హరియాణాలో ఆప్‌ ఖాతా తెరవలేదు.హరియాణాలో భాజపా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పయనిస్తోంది. ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్‌, ఆప్‌.. ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలడం భాజపాకు లాభించిందనే చెప్పొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసివస్తుందని అంచనా వేసిన హస్తం పార్టీ ఆశలు తలకిందులయ్యాయి. చివరకు ఎగ్జిట్‌ పోల్స్‌ వేసిన అంచనాలు తారుమారయ్యాయి. ఇక త్వరలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఫలితాలతో ఆప్‌ అప్రమత్తంగా వ్యవహరించనుంది.

తాజావార్తలు