డిగ్రీ అడ్మిషన్లకు కార్యాచరణ

భద్రాద్రి కొత్తగూడెం,మే10(జ‌నం సాక్షి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులను చేర్పించడంలో 
అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  ఇక్కడ పనిచేసే అధ్యాపకులు ఈ కళాశాల నిర్వాహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. కళాశాల ప్రిన్సిపాల్‌ నండ్రు గోపి ఆధ్వర్యంలో అధ్యాపక బృందం అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కళాశాలకు ఉన్న మంచిపేరును  దృష్టిలో పెట్టుకొని అత్యధిక అడ్మిషన్లు చేసేందుకు పేరెంట్స్‌తో చర్చిస్తున్నారు.  ఇందుకోసం అవసరమైతే  ఇంటింటికి తిరిగి అడ్మిషన్లను సేకరిస్తారు. ఒక్క భద్రాచలం పట్టణమే కాకుండా నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు సైతం ఇంటింటికి వెళ్లి కళాశాల అడ్మిషన్ల పక్రియను చేపట్టడం విశేషం. కళాశాల నిర్వహణ సమర్ధవంతంగా ఉండటంతో ఇప్పటికే ఈ కళాశాలకు ప్రభుత్వం తరుపున అనేక అవార్డులు వచ్చాయి. కళాశాల ప్రిన్సిపాల్‌ గోపీని పలుమార్లు ప్రభుత్వం అభినందించడం జరిగింది. ఇతని పనితీరు భేష్‌గా ఉండటంతో కళాశాల నిర్వహణ బాధ్యతలు మరికొంత కాలం ఇతనికే అప్పగించేందుకు ఇటీవల కమిషనర్‌ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది.