డిజిటల్ జనగణనలో ‘కుల గణన’ ఉంటేనే సామాజిక న్యాయం

 


దేశ భవిష్యత్తు ప్రణాళికలకు అత్యంత కీలకమైన ‘జనగణన 2027’ ప్రక్రియ గురించి భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ కీలక ప్రకటన చేశారు. ఇది దేశవ్యాప్తంగా జరిగే 16వ జనగణన కాగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 8వది. జనాభా లెక్కలు రెండు విభిన్న దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా తయారీ, ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ ప్రక్రియ ఉంటుంది. రెండవ దశలో జనాభా గణన చేపడతారు. ఈ రెండవ దశలోనే కులాంతర గణన కూడా జరుగుతుంది.

ఈ ప్రక్రియ ఎంత ఆధునికమైనా, అందులో కులగణన లేకపోవడం బీసీ వర్గాలకు వెన్నుపోటు లాంటిదే. కుల గణన లేకుండా ఈ జనగణన పూర్తిస్థాయి సామాజిక చిత్రాన్ని చూపించలేకపోతున్నాయి. దేశంలో మెజారిటీ వర్గమైన ఓబీసీలను పక్కనబెట్టి డిజిటల్ పద్ధతులు ఎంతవరకు న్యాయం చేస్తాయి? రూ.6000 కోట్ల వ్యయంతో, 33 ప్రశ్నలతో రూపొందించిన గెజిట్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానం ఉన్నప్పటికీ, ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ లేకపోవడం మన దౌర్భాగ్యమే. ఎన్నో చిన్న చిన్న వివరాలన్నీ సేకరిస్తున్నారు.. కానీ జనాభా నిర్మాణానికి మూలమైన కుల గణనను విస్మరించడం సమంజసమా? దేశంలో 60 శాతం పైగా ఉన్న ఓబీసీలను ఇతరులుగా చూపించడం న్యాయమా? ఈ లెక్కల్లో గృహంలో నివసించే సభ్యుల సంఖ్య, పేర్లు, లింగం, కుటుంబ యజమాని వివరాలు, కులం తదితర సమాచారం సేకరిస్తారు. ఇంటి గదుల సంఖ్య, నివాసం ఉండే జంటల సంఖ్య, ఇంటి సదుపాయాలు, ఆస్తుల, ఆదాయ వనరుల వివరాలు అడుగుతారు. రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్‌ సౌకర్యం, ల్యాప్‌టాప్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, సైకిల్, స్కూటర్, మోటార్‌ సైకిల్, మోపెడ్, కారు, జీపు, వ్యాను తదితర వస్తువులు వంటి వివరాలు కూడా నమోదు చేస్తారు. కానీ ఓబీసీలకు న్యాయం చేసే సమాచారం మాత్రం పొందుపరచడం లేదు.

బీసీలు, ఓబీసీలు ఎన్నో విషయాల్లో పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. గ్రౌండ్ రియాలిటీ చూస్తే పరిస్థితి ఎంతో కఠినంగా ఉంది. విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో బీసీలు వెనుకబడే ఉన్నారు. దేశంలో సింహభాగం వారిదే.. కానీ సింహాసనం మాత్రం ఎక్కలేకపోతున్నారు. జనాభాలో 52–60% ఉన్నప్పటికీ, వారికి తగిన ప్రాతినిధ్యం లేదు. వారి డేటా సేకరించకపోతే హక్కులు ఎలా లభిస్తాయి? 42% బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రాలు ప్రయత్నిస్తే, కోర్టుల్లో అడ్డంకులు, రాజకీయాల్లో మౌనం ఎందుకు? బీసీలు చట్టసభల్లోకి వస్తే అగ్రకులాల ఆధిపత్యం తగ్గుతుందనే భయమే ఈ నిర్లక్ష్యానికి కారణమా? సామాజిక కోణంలో ఇది కేవలం గణాంకాల సమస్య కాదు—అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న. లెక్కల్లో కనిపించని వర్గాలకు పాలనలో స్థానం ఎలా వస్తుంది? బీసీల అసలు సంఖ్య ఎంత? వారి ఆర్థిక స్థితి ఏమిటి? విద్యలో ఎంత వెనుకబడి ఉన్నారు? అనే ప్రశ్నలకు సమాధానం లేకుండా సమానత్వం ఎలా సాధ్యం?

దేశంలో మెజారిటీగా ఉన్న ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఇవ్వలేకపోతే ఈ జనగణనకు అర్థం ఏమిటి? కేవలం డిజిటల్ ప్రక్రియతోనే అభివృద్ధి కొలుస్తారా? డేటా సేకరణ దశలోనే తప్పు జరిగితే, తర్వాతి పాలన ఎలా సరిచేస్తారు? బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చిత్తశుద్ధి ఎక్కడ? రాష్ట్రాలు మద్దతు ఇస్తే కేంద్రం ఎందుకు వెనుకడుగు వేస్తోంది? చట్టపరమైన కోణంలో కూడా తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండ్రా సాహ్నీ కేసులో 50% పరిమితి విద్య, ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజకీయ రిజర్వేషన్లపై ఎక్కడా ఆ పరిమితి లేదు. అయినప్పటికీ, బీసీలకు అధిక రిజర్వేషన్లు ఇవ్వాలంటే అదే పరిమితిని చూపిస్తున్నారు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 60% దాటాయి. “ఒక్కరికొక న్యాయం, మరొకరికొక న్యాయం” అన్న పరిస్థితి ఎందుకు? ఇది బీసీలను మోసం చేయడానికేనా? బీసీలకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఇవ్వగలరా? జనాభా గణనలో కుల గణన తప్పనిసరి చేయాలి. ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, వారి నిజమైన జనాభా వివరాలను సేకరించాలి.

అప్పుడే ఆ డేటా ఆధారంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన రిజర్వేషన్లు అమలు చేయాలి. రాష్ట్రాల బీసీ రిజర్వేషన్ బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించి, అవసరమైతే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి. “లెక్కలలో స్థానం లేకపోతే హక్కుల్లో స్థానం ఉండదు.” అనే విషయాన్ని ప్రతి ఒక్క బీసీ, ఓబీసీ నమ్మాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కుల గణనను జనగణనలో చేర్చాలి. దేశంలోని ఓబీసీల జనాభాకు తగిన శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇదే నిజమైన సామాజిక న్యాయం, ఇదే రాజ్యాంగ ధర్మం. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తే భవిష్యత్తు బాగుంటుంది. బీసీలు భవిష్యత్తులో చట్టసభలలోకి ప్రవేశిస్తే దేశ, రాష్ట్ర రాజకీయాలలో ఓబీసీల ఆధిపత్యం పెరగడమే కాదు, వారి భవిష్యత్తు కూడా బాగుపడుతుంది.

సామాజిక న్యాయ ఉద్యమాల్లో విద్యార్థుల పాత్ర కీలకం. విద్యార్థి ఉద్యమాలు ప్రపంచ చరిత్రలో అనేక సామాజిక మార్పులను తీసుకొచ్చాయి. సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడంలో మేధావుల పాత్ర ప్రధానం. పండితులు, పాలకులు, విద్యార్థులు ఓబీసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో పాలుపంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 1881లోనే కులగణన ప్రారంభమైంది. 1931లో బీసీల లెక్కలు తేల్చారు. ఆ తర్వాత 1948లో సెన్సెస్‌ యాక్ట్‌ను తయారు చేశారు. అప్పటి నుంచి నేటి బీజేపీ పాలన వరకు బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2010లో పార్లమెంట్‌ సాక్షిగా జనగణనతోపాటు కుల గణన చేయాలని డిమాండ్‌ చేసింది. కానీ నేడు అధికారంలో ఉన్నా అందుకు పూనుకోవడం లేదు. ఇక డిజిటల్ జనగణనలో ‘కుల గణన’ లేకుండా చేసి బీసీలకు తీరని అన్యాయం చేసింది.

దుండ్ర కుమారస్వామి
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు,
బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్
9959912341