అన్నారం షరీఫ్ చెరువును కొల్లగొడుతున్న మోరం మాఫియా..!
– రాత్రివేళ హిటాచీలు గర్జిస్తున్నా పట్టించుకోని అధికారులు
– ప్రజల ఆస్తిని పంచుకుంటున్న అక్రమార్కులు..?
పర్వతగిరి జూన్ 15: (జనం సాక్షి) పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ చెరువు అక్రమార్కుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయిందా? ప్రజల అవసరాల కోసం నిర్మించిన చెరువును కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత సంపదగా భావించి రాత్రి వేళల్లో హిటాచీ యంత్రాలతో మోరంను యథేచ్ఛగా తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పగటిపూట ప్రజల కంట పడకుండా, రాత్రి చీకటి మాటున సాగుతున్న ఈ దందా వెనుక ఎవరి అండదండలు ఉన్నాయన్నది ఇప్పుడు గ్రామంలో హాట్‌టాపిక్‌గా మారింది. చెరువు గర్భాన్ని కోసుకుంటూ హిటాచీలు గర్జిస్తున్నా, ట్రాక్టర్లు వరుసగా మోరం తరలిస్తున్నా సంబంధిత శాఖలు మాత్రం కళ్లు మూసుకుని కూర్చోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గ్రామ ప్రజల సమస్యలపై పోరాడాల్సిన కొందరు స్థానిక మోట లీడర్లే ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంలో భాగస్వాములయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన వారే అక్రమ దందాలకు అండగా నిలవడం గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. చెరువు నుంచి అక్రమంగా తరలిస్తున్న ప్రతి ట్రాక్టర్ లోడ్ వెనుక వేల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని, ప్రజల సహజ వనరులను కొల్లగొట్టి కొందరు తమ జేబులు నింపుకుంటున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. చెరువును అడ్డగోలుగా తవ్వడం వల్ల భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో హిటాచీలు, ట్రాక్టర్లు పనిచేస్తుంటే అధికారులకు కనిపించడం లేదా? అక్రమ తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి? ఈ మోరం మాఫియాకు రాజకీయ అండ ఉందా? ప్రజల చెరువును దోచుకుంటున్న వారిపై చర్యలు ఉండవా అని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చెరువులో జరుగుతున్న అక్రమ మోరం తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



