క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలి….
ములుగు లో ఘనంగా ఖెలో ఇండియా అస్మిత బాలికల సైక్లింగ్ పోటీలు…..
జెండా ఊపి ప్రారంభించిన సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్….
ములుగు,జూన్14(జనం సాక్షి):-
క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని సైక్లింగ్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు,రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ అన్నారు. ఆదివారం ఉదయం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన అస్మిత బాలికల సైక్లింగ్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువతులు, విద్యార్థినిలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ పోటీల్లో సీనియర్ కేటగిరి విభాగంలో సంగీత, జూనియర్ విభాగంలో సుమన శ్రీ అత్యంత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. కాగా,వారికి సైకిల్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ మెమెంటోలు అందజేయడంతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాదం ప్రవీణ్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత క్రీడల వైపు ఆసక్తి పెంచుకుని శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించాలని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని,క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని అన్నారు.గ్రామీణ ప్రాంతాల నుంచి మరింత మంది క్రీడాకారులు ముందుకు వచ్చి జిల్లా,రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.పోటీల నిర్వహణలో భాగంగా పాల్గొన్న క్రీడాకారులకు నిర్వాహకులు అవసరమైన సూచనలు అందించారు.పోటీలను విజయవంతం చేయడంలో కోచ్‌లు, వాలంటీర్లు,క్రీడా సంఘాల ప్రతినిధులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పోరిక అసిలాల్, కోచ్ శ్రీరామ్ క్రీడాకారులు, యువజన సంఘాల ప్రతినిధులు,పోలీసు అధికారులు,108 సిబ్బంది, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.



