జడ్చర్లలో ట్రాఫిక్ కష్టాలు.. తీరని ప్రయాణికుల ఇబ్బందులు
జడ్చర్ల, జూన్ 15 (జనంసాక్షి): జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ప్రధానంగా అంబేద్కర్ చౌరస్తా, నేతాజీ చౌరస్తా ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి 167పై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో, రోడ్డు దాటడం కూడా కష్టతరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన సాగుతుండటం, దానికి తోడు అక్కడ ఉన్న డ్రైనేజీ సమస్యలు వాహనదారులకు శాపంగా మారాయి. నిత్యం హాస్పిటల్స్, ఆఫీసులకు వెళ్లే సామాన్య ప్రజలు, ఉద్యోగులు ట్రాఫిక్ జామ్ వల్ల తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. సమస్యపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేరని స్థానికులు విమర్శిస్తున్నారు. నగరంపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు. ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి ప్రాంతం నుండి కావేరమ్మపేట వైపు వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేస్తే, ట్రాఫిక్ రద్దీ కొంతమేర తగ్గే అవకాశం ఉందని ప్రజలు సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బైపాస్ రోడ్డు లేదా ప్రత్యామ్నాయ రహదారుల పనులను వేగవంతం చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



