కెటికె-5 గనిలో బ్లాస్టింగ్ ప్రమాదం:కార్మికుడికి గాయాలు
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5 గనిలో పెద్ద ప్రమాదం తప్పింది. బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేస్తుండగా మందుగుండు చేతిలోనే పేలింది. గని లోపల 13వ లెవెల్‌లో ఈ ఘటన జరిగింది. షార్ట్ ఫైరర్‌గా పనిచేస్తున్న శ్రీరాముల ప్రదీప్ చేతిలో పూర్ణిమ అకస్మాత్తుగా పేలింది. దీంతో ప్రదీప్ ఎడమ చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు స్పందించారు. గాయపడిన ప్రదీప్‌ను వెంటనే భూపాలపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యం అందుతోంది. విషయం తెలుసుకున్న సింగరేణి ఉన్నతాధికారులు గనికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేపట్టారు. భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కెటికె-5 గనిలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గని కార్మికుల భద్రతపై అధికారులు మరింత దృష్టి పెట్టాలని కోరుతున్నారు.



