తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం: జెసి
భద్రాద్రి కొత్తగూడెం,మే4(జనం సాక్షి): అకాల వర్షాలకు పలుచోట్ల రబీ ధాన్యం తడిసిపోగా.. మరికొన్ని చోట్ల మామిడితోటలు ద్వంసం అయ్యాయి. పంటనేలరాలింది. అధికారులు పంటనష్టాన్ని అంచనావేసి పరిహారం అందచేయాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 27,210 బస్తాల ధాన్యం అంటే 1088.400 మెట్రిక్ టన్నులు తడిసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో ఎక్కువ నష్టం జరిగిందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లా ఇంకా 14,190.720 మెట్రిక్ టన్నుల ధాన్యం 3.54 లక్షల బస్తాల్లో నింపి రవాణాకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.రాంకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేకపోతే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో అన్ని చర్యలు తీసుకున్నామని, టార్పాలిన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ తెలిపారు. జిల్లాలోని అశ్వారావుపేట, పాల్వంచ,
గుండాల, బూర్గంపాడు, పినపాక, ఇల్లెందు, టేకులపల్లి, దమ్మపేట, ములకలపల్లి, దుమ్ముగూడెం, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురియడంతో ఇక్కడ పంటలకు తీవ్ర నస్టం వాటిల్లింది. అకాలవర్షంతో అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక్కసారిగా పెనుగాలులతో ముంచెత్తిన వర్షం అన్నదాత వెన్నువిరిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట విక్రయించేందుకు కొందరు మార్కెట్ యార్డులకు, కొనుగోలు కేంద్రాలకు తీసుకురాగా మరికొందరు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి గాలికి కొట్టుకుపోగా వర్షానికి తడిసిపోయాయి. కొన్నిచోట్ల చేతికందిన పంట వర్షార్పణం కాకుండా కాపాడుకొనేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు.
సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో అత్యధికంగా 50 వేల బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి రైతులు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కల్లూరు మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం బస్తాలను చూసి రైతులు బావురుమంటున్నారు. ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పుల్లయ్యబంజర, కోండ్రుపాడు, కుప్పెనకుంట్ల, అడసర్లపాడు, వేంసూరు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. కొణిజర్ల, వైరా, బోనకల్లు, మధిర, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం గ్రావిూణం మండలాల్లోనూ వర్షం అన్నదాతను దెబ్బతీసింది. ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతులు నిల్వ చేసిన మొక్కజొన్నలు సైతం దెబ్బతిన్నాయి. ఉభయ జిల్లాల్లో పంట నష్టం రూ.కోట్లలో ఉంటుందని అంచనా. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి నష్టపోయిన రైతులను ఓదార్చారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి. మిరప, పత్తి బస్తాలు సైతం తడిసి దెబ్బతిన్నాయి. మార్కెట్ యార్డుకు తెచ్చిన పంట కళ్లెదుటే తడిసిపోతుంటే దాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. మార్కెట్ అధికారులు సకాలంలో రైతులకు టార్పాలిన్లు, పట్టాలు అందించలేకపోయారు. మార్కెట్ యార్డుల్లోనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.