తహశీల్దార్‌ అరెస్టుతో ప్రజా సంఘాల స్పందన

కర్నూలు, జూలై 29 : కల్లూరు మండలం తహశీల్దార్‌గా పని చేసిన అంజనాదేవి పలు అవినీతి, ఆరోపణలలో చిక్కుకొని ఎట్టకేలకు ఎసిబి వలలో పడి అరెస్టయ్యారు. గత మూడు సంవత్సరాలుగా కల్లూరు మండలంలో భూములను అక్రమంగా బినామీ పేర్లతో అమ్మి సొమ్ము చేసుకుంటున్నదని పలు మార్లు ప్రజా సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆమె అవినీతి అక్రమాలపై పలు మార్లు ప్రజాసంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. అధికారుల్లో స్పందన లేకపోవడంతో ఆమె అవినీతికి అంతులేకుండాపోతుందని ఆందోళన చెందుతూ వచ్చారు. ఎట్టకేలకు ఆదివారం అంజనాదేవి ఇంటిపై ఎసిబి దాడులు చేసి ఐదు కోట్ల రూపాయల పైబడి అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో అంజనాదేవి వ్యవహారం బయటపడడంతో ప్రజా సంఘాలు సోమవారం హర్షం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా ఆమె నివాసంపై ఆకస్మికంగా తనిఖీలు జరిపేందుకు వెళ్లిన ఎసిబి అధికారులకు చుక్కెదురు కావడం దురదృష్టకరమని అన్నారు. ఆమె ఇంటిలో విదేశీ కుక్కలను కాపలాగా ఉంచి ఎసిబి అధికారులను లోనికి రానివ్వకుండా అడ్డుకున్నది. వారు కుక్కలను అక్కడి నుండి తప్పించమని అంజనాదేవిని ఆదేశించినా ఆమె బేఖాతర్‌ చేసి ఇంట్లో ఉన్న బంగారు నగలు, కీలకపత్రాలను దాచి ఉంచిన అనంతరం ఎసిబి అధికారులను అనుమితించడం మూర్ఖత్వానికి నిదర్శనమని ప్రజా సంఘాలు విమర్శించాయి. నిష్పక్షపాతంగా ఎసిబి అధికారులు అక్రమ ఆస్తులను వెలికితీసి స్వాధీనం చేసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. అదేవిధంగా అక్రమంగా రిజిస్టర్‌ చేయించుకున్న ప్రభుత్వ స్థలాలను కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.