తెలంగాణ భాషని మాండలికం అనకండి

భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మన రాష్ట్రంలో తెలంగాణ భాష మర్యాదపూర్వకమైన భాష కాదన్న అపప్రద ఉంది. తెలంగాణ భాషలో రాయడం సంగతి అటుంచి ఆ భాష మాట్లాడటానికే జంకాల్సిన స్థితి తెలంగాణ ప్రజలకేర్పడింది. తెలంగాణ భాషలో మాట్లాడటానికి తెలంగాణ ప్రజలు ఆత్మన్యూనతకు లోనవుతున్నారన్నది వాస్తవం. అందుకని తెలంగాణ రచయితలు, కవులు తమ అనుభూతులని, భావాలని, బాధలని తమ భాషలో కాకుండా ప్రచార, ప్రసార సాధనాల భాషలో వెల్లడించాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రజల భాషను నీచ, దుష్టపాత్రలకే మీడియా పరిమితం చేసింది, చేస్తుంది. దాశరథి రంగాచార్యలాంటి రచయితలు తెలంగాణ భాషను పాత్రోచితంగా మాత్రమే ఉపయోగించారు. తెలంగాణ భాషను పూర్తిగా పరిపూర్ణంగా ఉపయోగించిన వ్యక్తి అల్లం రాజయ్య. తెలంగాణ భాషలో విరివిగా కథలు నవలలు ప్రారంభమైనది మాత్రం అల్లం రాజయ్యతోనే.
తెలంగాణ భాషలో సామాన్య పల్లెవాసుల సుఖదు:ఖాల పోషణ ఉప్పల నరసింహం వినిపించారు. రాజయ్య కథలు తెలంగాణ భాషలో వచ్చినపుడు జరిగిన గొడవ అంతా ఇంతా కాదు. తెలంగాణ రచయితలు ఎప్పుడూ తెలంగాణ భాష గురించే మాట్లాడుతారు. వేరే విషయాలేమీ లేనట్లు – అనే విమర్శకులూ ఉన్నారు. తెలంగాణ భాషని సినిమాల్లోకే కాదు టీవీల్లో వస్తున్న నాటకాలే కాదు చివరికి సందేశాత్మక ప్రకటనల్లో, టీవీ చానళ్ల ప్రకటనల్లో కూడా కించపరిచే విధంగా ఉంటున్నాయి. తెలంగాణ భాషపై సాంస్కృతిపై జరుగుతున్న దాడిని వివక్షను ఏ స్థాయిలో ప్రతిఘటించాలో ఆ స్థాయిలో ప్రతిఘటించడం లేదన్నది వాస్తవం.
ఏ ప్రాంత ప్రజలైనా భాషాపరంగా సంస్కృతిపరంగా తమ ప్రత్యేకతని కోల్పోవడానికి వీల్లేదు. తెలంగాణలో అక్షర జ్ఞానం ఉన్నవారు తమ భాషని, పలుకుబడిని, జాతీయాలని, సామెతలని మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయాన్నే కొత్తపల్లి జయశంకర్‌ – డాక్టర్‌ రమేశ్‌ ‘అడవి’ కవితా సంపుటికి ముందుమాట రాస్తూ ఈ విధంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతపు యాస, నుడికారం, వలసవాదుల చేతిలో నిరాదరణతోబాటు అవహేశనకు గురికావడం రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఇది చాలా ప్రమాదకర ధోరణి. ఏ ప్రాంత ప్రజలైనా ఆర్థికంగా వెనుకబడితే మళ్లీ పుంజుకోవచ్చు. రాజకీయంగా అణచివేయబడితే మళ్లీ తెప్పరిల్లుకోవచ్చు. కానీ సాంస్కృతికంగా భాషాపరంగా ఉన్న ప్రత్యేకతని కోల్పోతే తమ అస్తిత్వాన్ని శాశ్వతంగా కోల్పోతారు. ఇది వాస్తవం. తెలంగాణ భాషలో వచ్చిన కవితా సంపుటాల ప్రస్తావన వచ్చినపుడు యాదికి వచ్చేవి నాలుగే నాలుగు. అవి దేవరాజు మహారాజు రాసిన ‘గుడిసె-గుండె’, పంచారెడ్డి లక్ష్మణ రాసిన ‘యిసిత్రం’ తెలిదేవర భానుమూర్తి రాసిన ‘ఊరోళ్లు’, టి. కృష్ణమూర్తి యాదవ్‌ రాసిన ‘తొక్కుడుబండ’. మొదటి రెండు సంపుటాలు 73-74ల్లో వెలువడ్డాయి. ‘ఊరోళ్లు’ ఒక దశాబ్దం తర్వాత 83లో వెలువడింది. మరో అర్ధ దశాబ్దం గడిచిన తర్వాత ‘తొక్కుడుబండ’ వెలువడింది. అయితే వచనంలో తెలంగాణ భాష కవిత్వంతో పోల్చినపుడు కొంత ఎక్కువగానే వాడుతున్నారని అనవచ్చు. కవిత్వంలో తెలంగాణ భాష చాలా అరుదుగానే జరిగింది.
తెలంగాణ భాషలో అప్పుడప్పుడు కవులు కవితలు రాసి ఉండవచ్చు. తెలంగాణలో వచ్చిన కవితా పంపుటులలో ఒకటి రెండు కవితలు తెలంగాణ భాషలో రాసినవి ప్రకటించి ఉండవచ్చు. కానీ అచ్చంగా పూర్తి తెలంగాణ భాషలోనే రాసిన కవితా సంపుటులు చాలా తక్కువ.
తాము భాషకి పరాయీకరణ చెందిన వైనాన్ని ధిక్కరిస్తూ పూర్తి తెలంగాణ భాషలోనే మొత్తం కవితా సంపుటిని వెలువరించడం ఇటీవలె ప్రారంభమైంది. నేటి తెలంగాణ కవులు తమ భావోద్వేగాలని అనుభవాలని తమ భాషలో కవిత్వీకరిస్తున్నారు. గ్యార యాదయ్య ‘ఎర్కోషి’ పేరుతో ఎలివట్టె శంకర్‌ ‘యాది’ పేరుతో దీర్ఘకవితలు వెలువరిస్తే భూతం ముత్యాలు ‘దుగిలి’ పేరుతో, మోతుకూరి అశోక్‌కుమార్‌ ‘కోల్పులోళ్లం’ పేరుతో తెలంగాణ భాషలో కవితా సంపుటాలు వెలువరించారు. తెలంగాణ భాషలో కవిత్వం రాసినపుడు ఇతర ప్రాంతాల వారికి అర్థం కావడానికి వీలుగా ఆ పుస్తకానికి అనుబంధంగా టిప్పణీ ఇస్తే బాగుంటుందని మిత్రులు అంటుంటారు. రావిశాస్త్రి ‘సొమ్ములు’ అంటే మనం అర్థం చేసుకోలేదా అని నిలదీసే రచయితలూ ఉన్నారు. ‘ఎర్కోషి’ అంటే అర్థం తెలియని తెలంగాణ మిత్రులు చాలా మందే ఉండి ఉండవచ్చు.
ఈ మధ్య తెలంగాణ రచయితల వేదిక వెలువరిస్తున్న ‘సోయి’ పత్రికలో ‘సిలబస్‌లో మన భాషకు చోటేది’ అన్న వ్యాసం వచ్చింది. పాఠ్యాంశాలలో వ్యవహారిక భాష పేరిట కోస్తావారి భాషని ప్రవేశపెట్టడం, దాన్ని ఈ ప్రాంతం వారు అంగీకరించడం చారిత్రక తప్పిదమని ఆయన ఆ వ్యాస రచయిత పేర్కొన్నాడు. తెలంగాణ ప్రజలు తమదికాదని భాషలో చదువుకొని, పత్రికలు చదివి, ప్రసార మాధ్యమాల భాషకిలోనై తమ భాషకి దూరంగా నెట్టివేయబడ్డారు. తమ భాషలో మాట్లాడటం తప్పనే ఆత్మన్యూనతా భావానికి లోనయ్యారు.
తెలుగు సాహిత్యంలో తెలంగాణ భాషే కాదు పరిసరాలు, గ్రామీణ జీవిత చిత్రణ, తెలంగాణ గ్రామాల పేర్లు కూడా తక్కువగా కన్పిస్తాయి. పాఠ్య పుస్తకాలలోనైతే అస్సలు కన్పించవు.
మూడు సంవత్సరాల క్రితం ఆకాశవాణి కోసం ఓ ఎనిమిది రేడియో లీగల్‌ నాటికలు రాసాను. ఆ నాటికల్లోని వాతావరణం తెలంగాణ గ్రామం ఉంటుంది. తెలంగాణ పాత్రలుంటాయి. సంభాషణల్లో ఎలాంటి యాస లేనప్పటికీ ప్రసారంలో పాత్రలు పలికినవి మాత్రం కోస్తా యాసలో, ఆ పాత్రలు తెలంగాణ యాసలో మాట్లాడకపోయినా పరవాలేదు కానీ కోస్తా యాసలో మాట్లాడటానికి వీల్లేదు. ఇలా జరగడానికి కారణం ఆ నాటికల్లోని పాత్రధారులు తెలంగాణ వారు కాకపోవడమే. తెలంగాణ భాషను ఇప్పుడు మాండలికం అనడానికి వీల్లేదు. వైవిధ్యం కోరే వాళ్లు తెలంగాణ భాషలోని సొగసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలవాటుపడాలి. తెలంగాణ గుండె గొంతుకలోంచి వచ్చిందే తెలంగాణ భాష. కవిత్వమూ కథలే కాదు దినపత్రికల పతాక శీర్షికల్లో కూడా తెలంగాణ భాష ప్రవేశించి ఎందర్నో ఆకర్షించింది. తెలంగాణ రచయితలు ప్రతి విషయంలో నిభాయించుకుంటున్నారు. అక్కడక్కడా తెలంగాణ పదాలని ఉపయోగించడమే కాదు మొత్తం కవిత్వమే తెలంగాణ భాషలో రాయాలంటున్నారు. రాస్తున్నారు.