దోమను వేటాడేందుకు..

టెక్సాస్‌లో ఒక్క మలేరియా కేసు నమోదైతే విమానాలతో ఫాగింగ్‌ చేయించి దోమలను అరికట్టారు. అక్కడ ప్రజారోగ్యానికి ఉన్న ప్రాధాన్యతకు ఈ ఘటన పెద్ద నిదర్శనం. ఇక్కడ అదే దోమలు కుట్టి వేలాది మంది మరణించినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లైనా ఉండదు అంటున్నారు అమెరికాలోని న్యూజెర్సీ జనరల్‌ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్‌ ఉపేంద్ర జె. చిల్కూరి.

దేశంలో ఏ రంగాన్ని చూసినా అవినీతి కంపుకొడుతోందని తెలిపారు. సేవారంగంలోనూ అవినీతి చొచ్చుకుపోయిందని, ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం కరీంనగర్‌కు వచ్చిన ఆయనతో జనంసాక్షి ఎడిటర్‌ ఎం.ఎం. రహమాన్‌ ఫేస్‌ టు ఫేస్‌.ప్రశ్న : అమెరికాలో ప్రజారోగ్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

ఉపేంద్ర : దోమ చిన్నజీవి. అది కుట్టి మనుషులు చనిపోవడం దారుణం. అమెరికాలోని టెక్సాస్‌లో ఒక్క మలేరియా కేసు నమోదైతే విమానాలతో తరలివెళ్లి ఫాగింగ్‌ నిర్వహించారు. అక్కడ ప్రజారోగ్యానికి, ప్రజల ప్రాణాలకు ఉన్న ప్రాధాన్యత అది. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయి. అన్ని సీజన్లలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. అదే ఇక్కడి ఆదిలాబాద్‌ జిల్లాలో మలేరియాతో రెండు వేల మంది, కరీంనగర్‌ జిల్లాలో డెంగీతో వందలాది మంది చనిపోయినా ప్రభుత్వాలు పట్టించుకోవు. అది అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా. ప్రశ్న : చాలా రోజుల తర్వాత మాతృదేశానికి వచ్చారు కదా ఎలా ఫీలవుతున్నారు?

ఉపేంద్ర : స్వదేశానికి వచ్చినందుకు సంతోషంగానే ఉన్న ఇక్కడ రోజురోజుకూ పెరుగుతున్న అవినీతి బాధపెడుతోంది.

ప్రశ్న : అవినీతిని ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారా? చెబితే విన్నారా?

ఉపేంద్ర : ఇంతకు ముందు దేశంలో నెలకొన్న అవినీతిపై స్నేహితులు చెబుతుంటే విని ఆశ్చర్యపోయేవాడిని. నా స్నేహితుడు ఇప్పలపల్లి హరికిషన్‌ తాను చదువుకున్న పాఠశాల భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చిన ఇందుకు సంబంధించిన పనులు చేసేందుకు కొందరు బాహాటంగానే లంచం అడిగారు. సేవ చేసేందుకు డబ్బులిస్తామంటే అందులోంచి లంచమివ్వమనడం ఎంత దారుణం. ఇలాంటి చర్యలతో దేశం పరువు గంగలో కలుస్తుంది. ఇతరులకు మనమంటే చులకన భావం ఏర్పడుతుంది.

ప్రశ్న : మన వాళ్లు ఏ ఏ రంగాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు?

ఉపేంద్ర : ఇప్పుడు ఐటీ సెక్టార్‌లో ఎక్కువ మంది ప్రవాస భారతీయులు సేవలందిస్తున్నారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో భారతీయులే ఎక్కువ. మొటరోలో కంపెనీలోనూ మనవారే ఎక్కువగా కనిపిస్తుంటారు. కరీంనగర్‌ జిల్లావారు కూడా ఎక్కువగా ఈ రంగంలోనే స్థిరపడ్డారు.

ప్రశ్న : మాతృభూమి అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రవాస భారతీయులకు స్థానిక ప్రభుత్వాల ప్రోత్సాహం ఉందా?

ఉపేంద్ర : ప్రభుత్వ పెద్దలు ఉపన్యాసాల్లోనే మాతృభూమి సేవలో ఎన్‌ఆర్‌ఐలు పాలు పంచుకోవాలని చెప్తారు తప్ప నిజంగా భాగస్వాములయ్యే వారికి సరైన తోడ్పాటునందించరు. దీనితోనే సేవ చేయాలని ఉన్నా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.

ప్రశ్న : దీనిని నివారించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి?

ఉపేంద్ర : రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐల మంత్రిత్వ శాఖ ద్వారా సేవ చేసేందుకు ముందుకు వచ్చే వారిని కో ఆర్డినేట్‌ చేసేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సేవ చేయాలనుకునేవారికి సర్కారు పరంగా ఎలాంటి అడ్డంకులూ ఏర్పడకుండా చూసుకోవాలి. మేమిచ్చే డబ్బులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఆఫీసుల్లో ఈ పనులు చకచక జరిగిపోయేందుకు ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి ఏర్పాట్లు చేస్తే పాఠశాలలు, ఆస్పత్రుల భవన నిర్మాణాలు, మాతృభాష అభివృద్ధిలో భాగస్వాములయేందుకు ఎందరో ఎన్‌ఆర్‌ఐలు ముందుకువస్తారు.

ప్రశ్న : అమెరికాలో ప్రవాస భారతీయుల హత్యలు పెరిగిపోతున్నాయి కదా, ఇందుకు కారణాలేమిటీ?

ఉపేంద్ర : ఇక్కడ కూరగాయలు, నిత్యావసరాలు దొరికినంత సులువుగా అమెరికాలో రివాల్వర్లు, ఆటోమేటిక్‌ రైఫిల్లు, ఇతర మారణాయుధాలు లభిస్తాయి. దీంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తులు ఉన్మాదంతో హత్యాకాండలకు దిగుతున్నారు. ఒక్కోసారి ఇందుకు బలయ్యేవారి సంఖ్య పదుల్లో ఉంటుంది. మార్కెట్లో ఆయుధాలు లభించడమే ఇందుకు కారణం. అత్యంత భద్రత ఉన్నా ఉన్మాదంలో చేస్తున్న హత్యలను స్పల్పకాలంలో పసిగట్టలేకపోతున్నారు.

ప్రశ్న : అమెరికాపై ఆర్థికమాంద్యం ప్రభావమెంత?

ఉపేంద్ర : ఆర్థికమాంద్యంలో చిక్కుకుని ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నా, అమెరికా త్వరగానే బయటపడింది. ఇందుకు కారణం అక్కడ ధనికులు ఎక్కవగా ఉండటమే. స్వతహాగా ఆర్థిక పరిపుష్టి ఉంది కాబట్టే అమెరికా త్వరగా మాంద్యం నుంచి కోలుకుంది.

ప్రశ్న : భారత్‌ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం స్థాయిలోనే ఉంది, ఇలా ఇంకెంతకాలం?

ఉపేంద్ర : ఇక్కడి పాలకులకు సరైజ విజన్‌ లేదు. వారి దృక్పదంలో మార్పు వచ్చే వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండబోదు. వారినుంచి అద్భుతాలు ఆశించడం అత్యాశే అవుతుంది.