నదుల కాలుష్య నివారణకు కార్యాచరణ ఏదీ?

కాలుష్యానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రజలు ఇష్టం వచ్చినట్లుగా ప్రకృతిని పాడు చేస్తున్నారు. ఎవరికి వారు మాకేంటి అన్న పద్దతిలో పోతున్నారు. ప్రజలే ప్రకృతికి ప్రధాన శతృవుగా మారారు. నదులను, పర్వతాలను కూడా వదలడం లేదు. ప్రధానంగా ప్లాస్టిక్‌ పెద్ద సమస్యగా మారింది. దీంతో వాతావరణం, భూమి, నీరు కలుషితం అయి ప్రకృతి విపరీత పరిణమాలను చూపిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. చివరకు తాగుసాగునీటిని ఇచ్చే నదీ జలాలలను కూడా కలుషితం చేస్తున్నారు. గంగానది కలుషితం కారణంగా దాని ప్రక్షాళనకు ప్రదాని మోడీ రెండేళ్లుగా ప్రకట చేస్తున్నా ప్రభావం కనిపించడం లేదు. ఎంతో పవిత్రంగా భావించే గంగను మనచేజేతులా నాశనం చేసుకుంటున్నాం. ఇకపోతే యాత్రా స్థలాల్లో ప్లాస్టిక్‌ ఓ పెద్ద మహమ్మారిగా మారింది. గుళ్లూగోపురాలు ఇందుకు మినహాయింపు కావడం లేదు. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సరిగా లేకపోవడం, ప్రభుత్వాలు కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో ప్రజల్లో బాధ్యతారాహిత్యం పెరిగింది. ప్రధానంగా నదులను కలుషితం చేసుకోవడం వల్ల అవి ఓ దశాబ్ద కాలంలో అయినా బాగుపడతాయా అన్నది అనుమానాంగానే ఉంది. ఎంతో సుందర సరస్సుగా ఉన్న హుస్సేన్‌ సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చిన ఘనత ప్రభుత్వాల, ప్రజలది. గోదావరి, కృష్ణా నదులను కూడా కలుషితం చేసుకుంటూ పోతున్నాం. దీంతో అనేకరకాల అంటురోగాలు వస్తున్నాయి. జలకాలుష్యం కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. గోదావరినే తీసుకుంటే దాని కాలుష్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. మొన్నటికి మొన్న పుష్కరాల్లో దానిని ఎంతగా కలుషితం చేశామో ఆలోచన చేయాలి. గోదావరి ప్రారంభం నుంచి సముద్రంలో కలిసేవరకూ నది ఒడ్డున ఇరువైపులా అనేక పట్టణాలు, గ్రామాలూ వందల సంఖ్యలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో త్రయంబకేశ్వర్‌, నాసిక్‌, కోపర్‌గావ్‌, నాందేడ్‌.. తెలంగాణలో బాసర, ధర్మపురి, గోదావరి ఖని, మంథని, కాళేశ్వరం, కోటిలింగాల, భద్రాచలం… ఆంధ్రప్రదేశలోని కొవ్వూరు, రాజమండ్రి, రావులపాలెం, నర్సాపురం, రాజోలు.. దిగువన యానాం తదితర గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చే మురికినీరంతా గోదావరిలోనే కలపడం వల్ల మనకు జీవనాధారంగా ఉన్న ఈ నది మురికి కూపంగా తయారవుతోంది. ఈ నీటిని శుద్ధిచేయాల్సి ఉన్నా పట్టించుకోక పోవడంతో ముప్పు పెరుగుతోంది. దీనికితోడు గోదావరి వెంట ఉన్న పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యం కూడా ఇందులోనే కలుస్తోంది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోనూ గోదావరి నదిపైన, ఉపనదులపైన పలు పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి వదిలే వ్యర్థాలు, మురికినీరు అంతా గోదావరిలోకి చేరి కలుషితమవుతోంది.  గోదావరి నదికి పెనుగంగ, వైన్‌గంగ, వార్ధా, మంజీర, ఇంద్రావతి, బిందుసార, ప్రవరా, ప్రాణహిత, మానేరు, తాలిపేరు, కిన్నెరసాని, శబరి, సీలేరు, తదితర ఉపనదులున్నాయి. పరిశ్రమలు విడుదల చేస్తున్న మురికినీరు ఆ ఉపనదులతో పాటు ప్రవహించి గోదావరిలో కలిసి కలుషితం చేస్తున్నాయి. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోవడం లేదు. గోదావరి నదికి ఉపనదిగా ఉన్న కిన్నెరసానిపై కేటీపీఎస్‌ పవర్‌ప్రాజెక్టు, భద్రాచలం పేపర్‌బోర్డు కర్మాగారం, హెవీ వాటర్‌ ప్రాజెక్ట్‌, సింగరేణి పరిశ్రమలు ఖమ్మం జిల్లాలో ఉండగా.. కొత్తగా మణుగూరు సవిూపంలో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు కూడా నిర్మాణం జరుగుతోంది.  ఖమ్మం జిల్లాలో కేటీపీఎస్‌ నుంచి వదులుతున్న బూడిద కిన్నెరసాని జలాలను కలుషితం చేసి గోదావరిలో కలుస్తుండగా, భద్రాచలం పేపర్‌బోర్డు కర్మాగారం నుంచి వస్తున్న మురికినీరు సైతం గోదావరిలోనే కలుస్తుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో థర్మల్‌ కేంద్రం, ఎన్టీపీసీ యాష్‌ పాండ్‌, సింగరేణి పవర్‌హౌస్‌ నుంచి ప్రతిరోజూవ్యర్థజలాలు గోదావరిలో కలుస్తున్నాయి. రాజమండ్రి వద్ద  పేపర్‌మిల్లు, హార్లిక్స్‌ ఫ్యాక్టరీ, అనేక ¬టళ్లు, దేవాలయాల నుంచి వచ్చే మురుగు, వ్యర్థాలు కూడా గోదావరిలో కలుస్తున్నాయి. దీనికితోడు.. గోదావరిలో లాంచీల్లో, మరపడవల్లో నిత్యం వేలాదిగా పర్యటించే పర్యాటకులు వినియోగించే ప్లాస్టిక్‌ కూడా గోదావరిలో జలచరాల పాలిట పెనుముప్పుగా మారుతోంది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసే తరుణంలో వాడే షాంపులు, సబ్బులు.. వాటిని పెట్టుకోవడానికి తెచ్చే ప్లాస్టిక్‌ సంచులు అన్నీ గోదావరిలోనే కలసి మనకు తీరని జలకాలుష్యాన్ని మిగులుస్తున్నాయి.  ఫలితంగా గోదావరిలో మత్స్యసంపద కూడా కనుమరగైపోతోంది. గోదావరిలో ఒకప్పుడు పెద్ద ఎత్తున మత్స్య సంపద ఉత్పత్తి అయ్యేది. జలకాలుష్యం కారణంగా మత్స్య సంపద పూర్తిగా రానురానూ కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. ఇదంతా రోజూ కళ్లకు కనిపిస్తున్న భయంకర దృశ్యం. అయినా స్థానిక నాయకుల నుంచి ముఖ్యమంత్రుల వరకు పట్టింపు లేకుండా పోయింది. దీనికి పాలకులకు ఎంత బాధ్యత ఉందో ప్రజలకూ అంతే బాధ్యత ఉంది. ఈ కాలుష్యాన్ని తొలగించేందుకు తక్షణం కదలాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలను తరలించడం లేదా కాలుష్యాన్ని గోదావరిలో కలవకుండా చూసుకోవడం తక్షణావసరంగా గుర్తించాలి. గోదావరి తీర ప్రజలను నిత్య చైతన్యం చేయాలి. అవసరమైతే కఠిన చట్టాలతో ఈ కాలుష్యం వదిలించాలి. అప్పుడే నదీ జలాలను రక్షించుకోగలం.