నాటక సప్తాహాల నిర్వహణకు సహకారం అందిస్తా : రామచంద్రరావు
ఏలూరు, జూన్ 24 : జిల్లాలో నాటక సప్తాహాల నిర్వహణకు తనవంతు సహకారం అందిస్తానని జిల్లా పౌర సంబంధాధికారి, జిల్లా సాంస్కృతిక మండలి కన్వీనర్ ఆర్‌విఎస్ రామచంద్రరావు చెప్పారు. స్థానిక జిల్లా సమాచార కేంద్రంలో ఆదివారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వృత్తి కళాకారుల సంఘ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో కళలను ప్రోత్సహించడానికి ఎంతో మంది దాతలు సిద్ధంగా ఉన్నారని, కళాకారులు కోరుకున్న రీతిలో నాటక సప్తాహాలను జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహించి విజయవంతం చేయడానికి కళాకారులకు ప్రభుత్వం తరఫున తగు ప్రోత్సహం అందిస్తామని రామచంద్రరావు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వం వృద్ధ కళాకారులకు నెలకు 500 రూపాయలు చొప్పున పెన్షన్లు అందిస్తోందని, జిల్లాలో కొంతమంది వృద్ధాప్యం వల్ల మరణించారని, వారి స్థానంలో కొత్తవారికి పెన్షన్లు అందించడానికి జిల్లా కలెక్టర్ వాణిమోహన్‌తో చర్చించి ఇక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే పారితోషికాన్ని కూడా 250 రూపాయల నుండి 600 రూపాయలకు పెంచడం జరిగిందని రామచంద్రరావు చెప్పారు. ప్రభుత్వం తరఫున కళాప్రదర్శనలు ఎక్కువగా ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత స్థాయిలో కళాబృందాల ద్వారా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశానికి ఏలూరు వృత్తి కళాకారుల సంఘ అధ్యక్షుడు మువ్వల అప్పారావు అధ్యక్షత వహిస్తూ కళాకారుల ప్రదర్శనల అనంతరం అర్ధరాత్రి సమయంలో ఇళ్లకు వస్తున్నప్పుడు పోలీసులు పట్టుకుంటున్నారని, అటువంటి సందర్భాలలో కళాకారులకు ఈ గుర్తింపు కార్డులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. జిల్లా కళాకారుల సంఘ అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు, కాలి సుబ్బారావు, రాధాకృష్ణ, సమాచార సూపర్ వైజర్ రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.