నాటో స్థావరంపై తాలిబన్‌ల దాడి

కాబూల్‌: అప్ఘనిస్తాన్‌లోని ప్రధాన నాటో స్థావరంపై ఆదివారం జరిగిన తాలిబన్‌ దాడిలో 11మంది మరణించారు.  బాంబులను శరీరానికి కట్టుకున్న తాలిబన్లు తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో 9మంది తాలిబన్లు అక్కడికక్కడే మరణించారు. జలాలాబాద్‌ దాడిలో మరో ఇద్దరు మరణించారు. వీరు సాధారణ పౌరులని  జిన్‌హువా వార్త సంస్థ ప్రసారం చేసింది. కాబూల్‌కు తూర్పు భాగంలో 120కిమీ  దూరంలో ఉదయం 6గంటలకు తాలిబన్‌ ఆత్మాహుతి దళ సభ్యులు నాటో స్థావరాలపై దాడి చేశారు. సెక్యూరిటీ దళాలకు వీరికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది.  దాడిలో ఆప్ఘన్లు, నాటో సైనికులు ఎంత మంది మరణించింది ఇంకా నిర్ధారణ కాలేదు. కాగా ఒక అప్ఘన్‌ సైనికుడు మరణించారని పలువురు అమెరికన్‌ సైనికులు గాయపడ్డారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  నాటో హెలికాప్టర్లు తీవ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. దాడి జరిగిన చోట పొగ దట్టంగా అలుముకుంది. తాలిబన్‌ ప్రతినిధి జైబుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ ఈ దాడికి తామే కారణమని ప్రకటించారు.