నాలుగో విడతలో పక్కాగా పనులు

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
ఖమ్మం,మే10(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నాలుగో  దశలో మంజూరైన చెరువు పనులను మంత్రి సవిూక్షించారు.  పనుల పరిశీలనలో పూర్తిస్థాయిలో అధికారుల పర్యవేక్షణ జరగాలన్నారు. ప్రతీ పల్లెలతో పాటు అటవీ ప్రాంతాల్లో గిరిజనులు, కొండరెడ్లు నివసించే ప్రాంతాలకు రహదారులు నిర్మించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ప్రభుత్వం అందజేసిన పోడుభూముల్లో తప్ప మళ్లీ పోడు వ్యవసాయానికి ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఇందుకు అటవీశాఖ అధికారులు సహకరించాలని మంత్రి  అన్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో గిరిజనులు, కొండరెడ్లు జనజీవనానికి దూరంగా ఉంటూ అటవీ ఉత్పత్తులపై ఆదారపడి జీవిస్తున్నారని, వారు నిత్యావసర వస్తువుల కోసం, అనారోగ్యానికి గురైనా.. ప్రధాన గ్రామాలకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందువల్ల వారి రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించిందన్నారు. హరితహారంలో భాగంగా రానున్న వర్షాకాలంలో అనుకున్న టార్గెట్‌ మొక్కలు నాటించి, వాటి పరిరక్షణలో ప్రధాన భూమిక పోషించి, అటవీ శాఖవారే బాధ్యతగా వ్యవహరించాలన్నారు. చెరువు పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తోలుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించి, పూడిక మట్టి వలన కలిగే ఉపయోగాల గురించి వివరించాలని వ్యవసాయాధికారులు  తెలిపారు. వ్యవసాయ వాహనాలు ట్రాక్టర్‌లు వెళ్లేలా చెరువు కట్టలను పటిష్టంగా విస్తీర్ణం చేయాలన్నారు. నాలుగోవిడత మిషన్‌ కాకతీయ పనులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు.
ఆయకట్టు రైతులు స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించి అధికారులకు చెరువు, ఆయకట్టుపై స్పష్టత తెలపాలని సూచించారు. చెరువు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి హరీష్‌ రావు ఇప్పటికే హెచ్చరించారు.