నిర్భయ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి) :
అత్యాచార నిరోధక చట్టం (నిర్భయ బిల్లు-2013)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పలు అభ్యంతరాలు, నిరసనల అనంతరం ఈ బిల్లు మగంగళవారం లోక్‌సభకు చేరింది. ‘నిర్భయ’ దారణ అత్యాచారం అనంతరం వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యాచార నిరోధక బిల్లును రూపొందించింది. ఈ బిల్లులోని పలు నిబంధనలపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో వాటిని సవరించిన ప్రభుత్వం సభ ముందుకు తెచ్చింది. ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదించడానికి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సిద్ధంగా ఉందని సభలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు గోపీనాథ్‌ ముండే తెలిపారు. ‘అత్యాచార నిరోధక బిల్లు ఆమోదానికి బీజేపీ సానుకూలం. బిల్లు ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తాం’ అని చెప్పారు. అత్యాచార నిరోధక బిల్లుపై రాజకీయ పక్షాల్లో విభేదాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా పరస్పర అంగీకార శృంగార వయస్సును 18 నుంచి 16కు తగ్గించడంపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. అలాగే, మరికొన్ని నిబంధనలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని, రాజకీయంగా వేధింపులకు పాల్పడేందుకు అవకాశం  కల్పిస్తోందని ఆందోళన  వ్యక్తం చేశాయి. పరస్పర అంగీకార శృంగార వయస్సును తగ్గించొద్దని, రాజకీయ వేధింపులకు అవకాశం కల్పించే నిబంధనలు తొలగించాలని పట్టుబట్టాయి. దీంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం బిల్లులో ఆయా సవరణలను ప్రతిపాదిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఓటింగ్‌ అనంతరం బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ మీరా కుమార్‌ ప్రకటించారు.