పక్కదారిలో పొరుగు సేవలు

ఆన్లైన్ సెంటర్లో ధరణి ఆపరేటర్ పనులు

 

మానకొండూరు, ఆర్ సి సెప్టెంబర్ 18 (జనం సాక్షి)

మానకొండూరు తహసిల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న పొరుగు సేవల ఉద్యోగి ప్రైవేట్ ఆన్లైన్ సెంటర్ లో సేవలను అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొంతమంది వీఆర్ఏలతో కుమ్మక్కై అదనపు రాబడి కోసం రెవెన్యూ సేవలను అందించటం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగి కావడం, కొంతమంది వీఆర్ఏల సహకారంతో డాక్యుమెంట్లు విరాసత్, తదితర సేవలు కేవలం ఈ ఆన్లైన్ సెంటర్లో సంప్రదిస్తే తప్పక పనులవుతాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. రెవెన్యూ లోగుట్టు తెలిసిన వ్యక్తి కావడం తో పలు లోటు పాట్లు ఉన్న భూముల రిజిస్ట్రేషన్ సైతం అవలీలగా పూర్తి చేస్తున్నారనే అంశం తెరపైకి వచ్చింది. తహశీ ల్దార్ తో సహా డిప్యూటీ తాహశీ ల్దార్, ఆ రై లు తదితర ఉద్యోగులు ఇటీవల బదిలీపై వచ్చినవారే. దాంతో ఆపరేటర్ పై అజామయిషి కరువైంది. ఇది అతనికి వరమైంది. పొరుగు సేవలు అందించి అదనపు రాబడి కోసం ప్రైవేటుగా సేవలు అందిస్తున్నారు. ప్రజలు సైతం కార్యాలయంలో పనిచేసే వ్యక్తి కావటం, కొంతమంది వీఆర్ఏల మద్దతు ఉండటంతో ఈ ఆన్లైన్ సెంటర్లో వెళితేనే అన్ని పనులు చక్కబడతాయి అనే భావించి అడిగినంత ఇవ్వటంతో అందిన కాడికి దోచుకుంటున్నారు.

** నిస్తేజంలో మండల దస్తావేజుల లేఖరులు

 

రెవెన్యూ శాఖకు చెందిన కొంతమందివీఆర్ఏలు, ధరణి ఆపరేటర్ కలసి మెలసి అన్ని పనులు చక్కబెట్టడంతో మండల దస్తావేజుల లేఖరులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కరువై నిస్తేజములో కూరుకుపోయారు. కేవలం ఆ ఒక్క ఆన్లైన్ సెంటర్లో మాత్రమే అన్ని పనులు అవలీలగా జరుగుతాయనే ప్రచారంతో మండలంలో ఉన్న ఐదు మంది లేఖరులకు పని లేకుండా పోయింది. కొంతమంది వీఆర్ఏలు డాక్యుమెంట్ కు ఇంత అంటూ ముందుగా మాట్లాడుకునే పనులు చక్కబెడుతున్నారని సమాచారం.

**. కిం కర్తవ్యం…..

పర్సంటేజీల దందా వదిలి నేరుగా కార్యాలయంలో ప్రభుత్వ సేవలు పొందాలంటే, కార్యాలయ ఉద్యోగి పొరుగు సేవలను నిలిపివేసి కార్యాలయంలో కొంతమంది వీఆర్ఏల మాట చెల్లుబాటు కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు మరింత వేగంగా నాణ్యమైన సేవలు అందించడానికి అధికారులు చర్యలు చేపట్టి, వారిపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. మండల దస్తావేజుల లేఖరులు ఉన్నతాధికారులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయటానికి సమాయత్తమవుతున్నట్లు సమాచారం.